7 గురు ఆప్ ఎమ్మెల్యేలను కొనాలని చూశారు
మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేస్తారని ప్రచారం
బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
తమ ప్రభుత్వాన్ని కూల్చేవేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని …తమ ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరుపుతోందని, ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రిని త్వరలో అరెస్టు చేస్తామని బెదిరించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
‘‘ఇతర ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. మీరు కూడా మాతో రావొచ్చు. 25 కోట్లు ఇస్తాం ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయండి’’ అంటూ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు అందరూ దానిని తిరస్కరించారని పేర్కొన్నారు.గత తొమ్మిదేళ్లలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇలాంటి కుట్రలు చాలానే జరిగాయని, కానీ అవేమీ సాధ్యపడలేదని అన్నారు. దేవుడు, ప్రజలు తమకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చారని, ఆప్ ఎమ్మెల్యేలంతా నిక్కచ్చిగా ఉన్నారని, ఈసారి కూడా కుయుక్తులు విఫలమవుతాయని కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు.
ఆప్ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజలు ఆప్ పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉన్నారని, ఎన్నికల్లో బీజేపీని ఓడించారని అన్నారు. ‘మద్యం కుంభకోణంలో నన్ను అరెస్టు చేయలేక ఢిల్లీలోని మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది.. కానీ వారి ప్రయత్నాలు ఏ మాత్రం సఫలం కావు.. దేవుడు, ప్రజలు ఎల్లప్పుడూ మాకు మద్దతుగా ఉంటారు. మా ఎమ్మెల్యేలంతా కూడా గట్టిగానే కలిసి ఉన్నారు.. ఈసారి కూడా ఈ వ్యక్తులు తమ దుర్మార్గపు కుట్రల్లో విఫలమవుతారు’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.