పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ దాఖలు 14 వార్డుల నుంచి తరలి వచ్చిన జనం
ఆడారి మంచి మెజార్టీ తో విజయం ఖాయం రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి
విశాఖ:- పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కదం తొక్కారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి అభిమానం పోటెత్తింది. 14 వార్డులకు చెందిన కార్యకర్తలు, జన సందోహంతో నియోజకవర్గంలోని రహదారులు నిండిపోయాయి. శుక్రవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి రాజ్యసభ సభ్యులు వై వీ సుబ్బారెడ్డి తో కలిసి ఆడారి ఆనంద్ కుమార్ గోపాలపట్నం నూకాంబికా ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి బయలు దేరారు. గోపాలపట్నం నుంచి ఎన్ ఏ డి, కరాస, మర్రిపాలెం, కంచరపాలెం మీదుగా, ముఖ్య నాయకులు, ఆయా వార్డుల కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానుల తో కలిసి జ్ఞానాపురం జోనల్ కార్యాలయానికి చేరుకొని, ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఈ సందర్బంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నంలో అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ వేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ వారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో శుభకరమని అన్నారు. ఆడారి ఆనంద్ కుమార్ మంచి మెజార్టీతో గెలవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసామన్నారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతోనే గుడికి తాళాలేశారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వైసీపీ కి సానుకూల పవనాలు ఉన్నాయని అన్నారు. ఆయా వార్డుల్లో ప్రచారానికి వెళ్ళినపుడు, వారి నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో సమన్వయ కర్తగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయా ప్రాంతాల్లో ₹ 265 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. అలాగే సొంత నిధులతో అవసరమైన వారికి పెన్షన్ లు, విద్య, వైద్యానికి సంబందించిన ఆర్ధిక సహాయాలు అందినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపించనున్నాయని తెలిపారు.