అది 1983..
అప్పటికి ఇంకా భారతదేశంలో క్రికెట్ పిచ్చి అంతగా ముదరలేదు.
ఆ రోజుల్లో మనకి హాకీ ఇష్టమైన ఆట..పైగా జాతీయ క్రీడ.అందులోనే పతకాలు సాధించిన ఘనత.
అప్పటికే రెండు ప్రపంచకప్పులు(1975..79)
జరిగాయి.వెస్టిండీస్ రెండు కప్పులనూ ఎగరేసుకుపోయింది.
ఆ రెండు టోర్నీల్లో
మన దేశమూ పాల్గొంది.అయితే ఏం చేశామో..ఎంత సాధించామో క్రికెట్ అభిమానులకే గుర్తులేని పేలవ ప్రదర్శనలు..
ఇక మామూలు జనాలైతే అస్సలు పట్టించుకోని వైనం.
అలాంటి దశలో కపిల్ దేవ్ నేతృత్వంలో భారత జట్టు 1983 ప్రుడెన్షియల్ కప్పు వరల్డ్ టోర్నీలో పాల్గొనేందుకు ఇంగ్లండ్ వెళ్ళింది.అప్పుడు మన పేరు అండర్ డాగ్స్.. మొదట్లో ఒకటి రెండు మ్యాచ్ లు కొట్టి ముక్కుతూ మూలుగుతూ సెమీస్ చేరినా అదే ఎక్కువ..అంతకంటే మరో అడుగు ముందుకు పడేదేలే అని ప్రపంచం సంగతి పక్కన పెడితే మనకే నమ్మకం లేని పరిస్థితి.సెమీఫైనల్ కూడా కొట్టి కపిల్ సేన
తుది సమరానికి సిద్ధమైనా కప్పుపై ఆశలు ఏర్పడలేదు.ప్రత్యర్థి అరివీరభయంకరమైన వెస్టిండీస్ జట్టు.అప్పటికి అదే క్లైవ్ లాయిడ్ నేతృత్వంలో రెండు కప్పులు సాధించిన అప్రతిహత కరేబియన్లు.మొదట బ్యాటింగ్ చేసిన మన జట్టు స్కోరు 183..అది కూడా అరవై ఓవర్ల మ్యాచ్.విండీస్ జట్టు ఉఫ్ఫని ఊదేస్తుందని భావించింది క్రికెట్ ప్రపంచం.
కాని అందరి అంచనాలను పటాపంచలు చేసి భారత జట్టు విండీస్ ను 140 పరుగులకే పరిమితం చేసి చరిత్ర సృష్టించింది.
కపిల్ జట్టు కాస్త
కపిల్ డెవిల్స్ గా అవతరించింది.
భారత్ లో క్రికెట్ ఫీవర్ మొదలైంది.అప్పటి నుంచి జనాలకి ఒకటే క్రికెట్ పిచ్చి.
అటు తర్వాత మళ్లీ 2003 లో ఇండియా ఫైనల్ కు చేరినా కప్పును చేజార్చుకుంది.
అయితే 2012 లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో
టీమిండియా మళ్లీ ప్రపంచకప్ సాధించింది.
శ్రీలంకను మట్టి కరిపించి
కప్పును కైవసం చేసుకున్న భారత్ ఆ టోర్నీలో ఇంచుమించు ఫేవరెట్ గానే
బరిలోకి దిగింది.అందరూ ఊహించినట్టు కప్పు గెలిచింది.
ఇప్పుడు 2023..
రోహిత్ శర్మ నాయకత్వంలో భారీ అంచనాలతో విజయయాత్ర ప్రారంభించిన టీమిండియా ఊహించని రీతిలో విజయాలు సాధిస్తూ పరాజయమే లేక ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఇప్పుడు ప్రత్యర్థి ఎనిమిది సార్లు ఫైనల్ చేరి అయిదు కప్పులు కొట్టిన
ఆస్ట్రేలియా.ఈ టోర్నమెంట్లో మనం ఇప్పటికే కంగారూలను ఓడించి ఉన్నాం.ఆ రకంగా మనదే పైచేయిగా ఉంది.కాని ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వెయ్యడానికి లేదు.
లీగ్ దశలోనే నిష్క్రమిస్తుందనుకున్న ఆస్ట్రేలియా అనూహ్యంగా పుంజుకుని ఫైనల్ చేరి
ఆరో కప్పు కోసం ఉవ్విళ్లూరుతోంది.
ఇటు మన జట్టు మునుపెన్నడూ లేనంత ఉత్సాహంతో కదం తొక్కుతోంది.టాప్ ఆర్డర్ బ్రహ్మాండమైన ఊపులో ఉంది.రోహిత్..కోహ్లీ ఒకరు విఫలమైతే ఇంకొకొకరు
దంచేస్తున్నారు.ఒకోసారి ఇద్దరూ ఇరగదీసేస్తున్నారు.
ఈ ఇద్దరూ గాక శుభమన్ గిల్.. శ్రేయస్ అయ్యర్ దుల్లగొట్టేస్తున్నారు.
ఈ అందర్నీ దాటి అవకాశం వస్తే కె ఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్..
అజయ్ జడేజా..ముగ్గురూ కలిపి తక్కువలో తక్కువగా 150 వరకు లాగించేస్తున్నారు.
ఇక బౌలింగ్ విభాగంలో మొహమ్మద్ షమీ దడ పుట్టించేస్తున్నాడు.తాజాగా కివీస్ మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసి ఫైనల్లో మన ప్రత్యర్థి ఆస్ట్రేలియాకి సింహస్వప్నంగా మారాడు.అతగాడికి తోడుగా
సిరాజ్.. బుమ్రా..చైనామన్ కుల్దీప్ వికెట్ల ఆకలితో ఉన్నారు.ఆపై జడేజా కూడా మద్ది మద్దిలో మెరుపులు మెరిపిస్తున్నాడు.సెమీస్ లో ఫీల్డింగ్ విభాగంలో కొంత తడబడినా ఓవరాల్ గా
ఈ టోర్నీలో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది.నిజానికి టీమిండియా ఇప్పటికే ప్రపంచాన్ని జయించింది. టోర్నీలో పాల్గొన్న అన్ని దేశాలనూ ఓడించి..సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ పై రెండోసారి గెలిచి సగర్వంగా
తుది సమరానికి చేరింది.సరే..తొలి దశల్లో ఎన్ని జట్లపై గెలిచినా
ఫైనల్ ఫైనలే.. ఫైసలే..
హోరా హోరీ పోరాటమే..!
ఇప్పుడు అందరి దృష్టి అటువైపే..కప్పు మనదేనన్న నమ్మకం అందరిలోనూ.
కానీ ఓ మూల
చిన్న సందేహం..
బెమ్మిని తిమ్మిని చెయ్యగల దిట్ట ఆస్ట్రేలియా.
ఆ దేశం అమ్ముల పొదిలో అన్ని అస్త్రాలు ఉంటాయి.వాటికి తోడు మాటల బాణాలు..
టీమిండియా ప్రధాన బలం టీం స్పిరిట్.. అందరు ఆటగాళ్ళు వారి వారి విభాగాల్లో మంచి ఫామ్ లో ఉన్నారు.కెప్టెన్ ఇప్పుడు రోహిత్ ఒక్కడే కాదు.అవసరమైన సందర్భంలో అందరూ నాయకత్వ స్ఫూర్తి చూపిస్తూనే ఉన్నారు.శర్మ కూడా అందుకు తగినట్టే ఎవరు ఏ సలహా ఇచ్చినా స్వాగతిస్తూ చక్కని స్పోర్టివ్ స్పిరిట్ తో ముందుకు సాగుతున్నాడు.
అహ్మదాబాద్ స్టేడియం భారత జట్టుకు పూర్తి కిక్కు ఇస్తూ అభిమానులతో నిండిపోతుంది.జట్టుకు అదనపు ఉత్సాహం ఇచ్చేందుకు స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తరలి వస్తున్నారు.దేశాధినేత సమక్షంలో గెలిస్తే అదో సంబరం..!
ఏదేమైనా ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా..
ఆ కిక్కు కోసమే దేశం మొత్తం ఎదురు చూస్తోంది.
కమాన్..రోహిత్ గ్యాంగ్..
కప్పు గెలిచి హ్యాట్రిక్ సాధించాలి.. భారతదేశం మొత్తం మీ విజయాన్ని కాంక్షిస్తూ మీ వెనక ఉంది.
మీ జట్టులో ఉన్నది పదహారు మంది కాదు.నూట నలభై కోట్లకు పై మాటే..
ఇది ఇండియా..మన జట్టు టీమిండియా..క్రికెట్ మన మానియా..ఈ రోజు మన గెలుపు చూసి దునియా మొత్తం తాలియా..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286