Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్కూటమి నేతలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు

కూటమి నేతలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు

అందుకే ఇండియా కూటమి కుప్పకూలింది
రాష్ట్రపతి ప్రసంగంపై లోక్ సభలో ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
ప్రసంగించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:‌ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. సభకు సెంగోల్ (రాజదండం) తీసుకువచ్చే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామని వెల్లడించారు. ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్ హంగామా చేసిందని మోదీ ఎద్దేవా చేశారు. ఆ కూటమిలో నేతలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, అందుకే కూటమి కుప్పకూలిందని అన్నారు. ఇలాంటి నేతలను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదం తమకు ఎప్పుడూ ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమిదే విజయం అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇంకా సంచలన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీపై పోటీ చేయడానికి విపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. కొంతమంది పోటీ చేసే స్థానాలు మార్చుకుంటున్నారని, ఈసారి కొందరు రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. దొడ్డిదారిన రాజ్యసభకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మారలేదని, కాంగ్రెస్ తోటి విపక్షాలను ఎదగనివ్వడంలేదని మోదీ ఆరోపించారు. అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా తమ ప్రభుత్వంపై పదే పదే అవే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కొత్త దుకాణాలు తెరుస్తున్నారని, కాంగ్రెస్ ఒకే ప్రొడక్ట్ ను మాటిమాటికీ లాంచ్ చేస్తోందని రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇక తమ పాలన గురించి చెబుతూ… 2014లో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకువచ్చామని వెల్లడించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఏం అనుకున్నా హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
తాము ఆర్టికల్ 370ని రద్దు చేసి చూపించామని, చంద్రయాన్ విజయంతో చరిత్ర సృష్టించామని చెప్పారు. బ్రిటీష్ కాలం చట్టాలను రద్దు చేశామని పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేశామని వివరించారు. 50 కోట్ల మంది పేదలతో బ్యాంకు అకౌంట్లు తెరిపించామని వెల్లడించారు. అయోధ్యలో భవ్యమందిరం నిర్మించామని, శ్రీరాముడు తన సొంత ఇంటికి వచ్చాడని తెలిపారు. వందేభారత్, నమో భారత్ రైళ్లు దేశ ప్రగతికి చిహ్నాలు అని పేర్కొన్నారు. మరో వంద రోజుల్లో తమ ప్రభుత్వం మూడోసారి ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తమ పాలనను ప్రజలు వెయ్యేళ్లకుపైగా గుర్తుంచుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఓబీసీలు తీవ్రంగా నష్టపోయారని, కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం ద్వారా తాము ఓబీసీలను గౌరవించామని మోదీ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article