గొల్లప్రోలు : కొడవలి బౌద్ధ మహా స్థూపం వద్ద మైనింగ్ నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై బౌద్ధ స్తూపం పరిరక్షణ సమితి హర్షం వ్యక్తం చేసింది. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గల బుద్ధుని దాతు గర్భ స్థూపం చారిత్రక కట్టడం గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షణలో ఉంది. సర్వే 133/1లో 72 ఎకరాల్లో విస్తరించి ఉన్న స్థూపం గల కొండను మైనింగ్ పేరిట ధ్వంసం చేయబోతున్న విషయం తెలుసుకున్న కొడవలి బౌద్ధ మహాస్తూప పరిరక్షణ సమితి మైనింగ్ త్రవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలంటూ సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఫలితం లేకపోవడంతో కొడవలి బౌద్ధ మహాస్తూప పరిరక్షణ సమితి తరపున గౌరవ అధ్యక్షులు అయితా బత్తుల రామేశ్వరరావు, అధ్యక్షులు పెయ్యల పావన్ ప్రసాద్, కోశాధికారి పంతగడ రాంప్రసాద్ సంయుక్తంగా హైకోర్టును ఆశ్రయించి ఫిల్ వేశారు. ఈ మేరకు కొడవలి బౌద్ధ మహా స్థూపం విస్తరించి ఉన్న కొండపై సమగ్ర సర్వే జరపాలని కొడవలి కొండపై చేపట్టిన త్రవ్వకాలను నిలుపుదల చేయాలని సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా బౌద్ధ వారసత్వ సంపదను కాపాడేందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్, న్యాయమూర్తులు తగిన ఆదేశాలు జారీ చేయడంపై బౌద్ధ మహాస్థాప పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు అయితా బత్తుల రామేశ్వరరావు, అధ్యక్షులు పెయ్యల పావన్ ప్రసాద్, కోశాధికారి పంతగాడ రాంప్రసాద్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.