ఆవును చంపిన వైనంతో బయటపడిన పెద్దపులి ఉనికి
బుట్టాయగూడెం
గత 15 రోజులుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. జిల్లాలో బుట్టాయగూడెం, గోపాలపురం, ద్వారకాతిరుమల, దేవరపల్లి, పెదవేగి, ఏలూరు, దూబచర్ల ఇలా పలు మండలాల్లో పెద్దపులి ఉనికి బయటపడుతూ వస్తుంది. పులి దాని ప్రయాణంలో కొన్నిచోట్ల జంతువులపై దాడులు కూడా చేసింది. అటవీ శాఖ అధికారులు పెద్దపులి ఉనికి కనిపెట్టే క్రమంలో పలుచోట్ల పులిజాడ, పాదముద్రలు కనుగొన్నారు. అటవీశాఖ అధికారుల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా కన్నుకు పులి చిక్కింది. పాపికొండల అభయారణ్యాల నుండి పులి బయటకు వచ్చినట్లు, గత 15 రోజులుగా పలు మండలాల్లో సంచరించిన పులి తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటిస్తున్నారు. కాగా తాజాగా పులి బుట్టాయిగూడెం మండలం కొవ్వాడ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఆవును చంపి,దాని ఉనికి బయట పెట్టుకుంది. తెలిసిన సమాచారం మేరకు కొవ్వాడ గ్రామానికి చెందిన కుంజం కొవ్వాడయ్యకు చెందిన ఆవుల మందలో ఒక ఆవును శనివారం రాత్రి పెద్దపులి చంపి సగం వరకు తినేసింది. ఆదివారం ఉదయం కొవ్వాడయ్య సోదరుడు రాజు ఆవులకు మేత వేయడానికి వెళ్ళాదు ఆవులలో ఒక ఆవు కనపడకపోయేటప్పటికి వెతకడం మొదలుపెట్టాడు. కొంత దూరంలోనే ఆవు కడేబరాన్ని చూసిన కొవ్వాడయ్య సోదరుడు రాజు హడలెత్తిపోయాడు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పులిజాడ కనుక్కోవడం కోసం తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. చంపి సగం తిన్న ఆవు కళేబరం వద్దకు మళ్లీ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కాకపోతే అటవీశాఖ అధికారులు చెబుతున్నట్లు పులి తిరుగు ప్రయాణంలో ఉంటే తిరిగి అభయారణ్యంలోకి వెళ్లిపోయే అవకాశం కూడా ఉందని ప్రజలు భావిస్తున్నారు. గత 15 రోజులుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వన్యమృగాల సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రైతులు, కూలీలు, ప్రయాణికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. వన్యప్రాణుల జాడ కనుక్కొని వాటిని పట్టుకోవడంలో అటవీ శాఖ అధికారుల వైఫల్యాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వన్యప్రాణుల సంచారంపై అటవీ శాఖ అధికారులు ప్రజలకు తగు సూచనలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై ఎటువంటి ప్రకటనలు విడుదల చేయకపోవడం కూడా ప్రజల్లో చర్చనీయాంశం అయింది.