పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బాలరాజు దంపతులు.
బుట్టాయగూడెం:దుర్గమ్మ తీర్థంగా ప్రసిద్ధి చెందిన రెడ్డి గణపవరం శ్రీ కనకదుర్గ శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి 99 వ వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయ సిద్ధంగా హోలీ పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే దుర్గమ్మ తీర్థ మహోత్సవాలు సోమవారం నుండి మొదలయ్యాయి. ఉత్సవాల ప్రారంభ సూచకంగా ఉదయం నాలుగు గంటలకు విజ్ఞేశ్వర పూజ అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.ఆలయ కమిటీ అమ్మవారికి నూతన వస్త్రములను అందించారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి మండపారాధన, కలశ స్థాపన, గోపూజ, ధ్వజారోహణము, స్వామివారికి అభిషేకము, అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, ఆయన భార్య పోలవరం వైసిపి ఇన్చార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కుబడులు తీర్చుకొని, దైవదర్శనం చేసుకున్నారు. భక్తులకు కావలసిన తాగునీరు, ప్రధమ చికిత్స, తదితర సౌకర్యాలనుఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బుట్టాయగూడెం ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని ఏర్పాట్లను చేశారు. తీర్థ మహోత్సవాల సందర్భంగా పలు దుకాణాలను, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు.