- మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి
- టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని 13వ డివిజన్ లో ప్రచారం
- మరువ కొమ్మ అవినీతిపై కరపత్రాలతో ప్రజలకు వివరణ
అనంతపురము బ్యూరో
మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందామని, తద్వారా అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని స్థానిక మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని 13వ డివిజన్ రామస్వామి గుడి లో పూజలు నిర్వహించి, టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గత 20 రోజులుగా నీళ్లు సరిగా రావడం లేదని, చెత్తను తొలగించడం లేదని, అధిక కరెంటు నీటి బిల్లులతో సతమతమవుతున్నామని, మరువ వంక మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని ప్రభాకర్ చౌదరికి విన్నవించారు. అలాగే, ఇంటి పట్టా ఇవ్వాలని, ఇల్లు నిర్మించాలని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగేతర శక్తులుగా పెత్తనం చెలాయిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి, ప్రజల్లోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో రూ.18 కోట్ల నిధులతో త్రివేణి నుండి అశోక్ నగర్ వరకు 3.4 కిలోమీటర్లు ఇరువైపులా గోడ నిర్మాణం చేపట్టడం, త్రివేణి నుంచి సూర్య నగర్ రోడ్డు బ్రిడ్జి వరకు కాలువపై కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టే విధంగా టెండర్లు పిలిచి సుధాకర్ ఇన్ఫ్రా సంస్థకు పనులు కేటాయించామన్నారు.
అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లను బెదిరించి టెండర్లు రద్దుచేసి మరొక కాంట్రాక్టర్ తో పని ప్రారంభించి.. కేవలం మూడు చోట్ల కల్వర్టులు, అశోక్ నగర్ బ్రిడ్జి నిర్మాణం చేయడం దారుణమన్నారు. ష్టపడి అమృత్ పథకం ద్వారా నిధులు సాధిస్తే ప్రజల అవసరాలను విస్మరించి కాంట్రాక్టులతో కమిషన్లకు కక్కుర్తి పడి ప్రధాన లక్ష్యానికి తూట్లు పొడిచారని, ఈ అంశాన్ని ప్రజలకు వివరించడానికి ప్రజా క్షేత్రంలోకి వచ్చామని ప్రభాకర్ చౌదరి అన్నారు. వచ్చే రెండు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నగరంలోని ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
గత మా ప్రభుత్వంలోనే నగరాభివృద్ధి
నగర అభివృద్ధి అంతా గత మా ప్రభుత్వంలోనే జరిగిందని, వైసీపీ నాలుగు సంవత్సరాల 11 నెలల కాలంలో చేసింది ఏమీ లేదని ప్రభాకర్ చౌదరి విమర్శించారు. రూ.91 కోట్లతో పైపులైన్ల నిర్మాణంతో పాటు 11 రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి రాబోయే రెండు దశాబ్దాల వరకు నగరానికి నీటి సమస్య లేకుండా చేశామని, చిన్నపాటి సమస్యతో మోటార్లు రిపేరుకొస్తే.. వాటిని మరమ్మతు చేసుకోలేని దద్దమ్మ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. గత 20 రోజులుగా ప్రజలు నీటి సమస్యతో సతమతమవుతున్నారని, వైసీపీ ప్రభుత్వంలో 4 సంవత్సరాల 11 నెలల్లో నగరాభివృద్ధికి చేసింది శూన్యమని, కార్పొరేషన్ నిధులతో నగరంలో ఏవో నాలుగు రోడ్లు వేశారని ఎద్దేవా చేశారు. నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంతో పాటు, ఎన్టీఆర్ మ్యూజియం, 100 ఎకరాల్లో శిల్పారామం, పీటీసీ స్టేడియం, కల్లూరి సుబ్బారావు మ్యూజియం, నగరమంతా ఓపెన్ జిమ్ములు, నగరంలో విద్యుత్ నగర్ సర్కిల్ నుండి జేఎన్టీయూ రోడ్డు వరకు స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ .10.82 కోట్ల గ్రాండ్ పనులు మంజూరు చేయించామని ఏకరువు పెట్టారు. అలాగే, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసి నగరంలో శాంతిభద్రతల సమస్యలు లేకుండా చేశామని, నగరంలో వేలాది చెట్లు నాటించామని, విద్యుత్ సబ్ స్టేషన్ లు, డ్వాక్రా మహిళలకు కమ్యూనిటీ భవనాలు నిర్మించామని, 13 వేల రేషన్ కార్డులు, మూడు కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అందించిన ఘనత గత తమ ప్రభుత్వ ఘనతేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజీవ్ రెడ్డి, ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు సాలార్ బాషా, మాజీ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న, తలారి ఆదినారాయణ, దేవళ్ళ మురళి, డిస్కో బాబు, డిష్ నాగరాజు, సరిపూటి రమణ, నటేష్ చౌదరి, నారాయణస్వామి యాదవ్, రాజారావు, సుధాకర్ యాదవ్, మారుతి కుమార్ గౌడ్, గుర్రం నాగభూషణ, తెలుగు మహిళలు స్వప్న, విజయ్ శ్రీ రెడ్డి, సంఘ తేజస్విని, కృష్ణవేణి, సరళ, జానకి, సుజాత, వసుంధర, హసీనా, షరీనా, మేడ మణమ్మ, తదితరులు పాల్గొన్నారు.