- టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట
కదిరి :ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగులు నిండా మోసపోయారని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కాలం వెళ్లదీశారని కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ విమర్శించారు. ఆదివారం కదిరి ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కందికుంట హాజరై మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. “2019 ఎన్నికల్లో జగన్ ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి మోసం చేశారు. నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. జగన్ చేతకాని పరిపాలనతో వ్యవస్థను నాశనం చేశారు. నాయకుడంటే ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలి. ధనార్జనే ధ్యేయంగా పాలన సాగిస్తున్న జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని దరిద్రమైన ప్రగల్బాలు పలికిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. యువతను మత్తులో దింపుతున్నారు. కనీస అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ప్రస్తుత పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. జగన్మోహన్ రెడ్డిని సాగనంపితేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారు. మరోసారి మోసం చేయడానికి వైసీపీ నాయకులు ముందుకు వస్తున్నారు ప్రజలు తస్మత్ జాగ్రత్త. సమర్థవంతమైన నాయకత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. ప్రజలు పారదర్శకంగా ఓటు వేయాలి. మన హక్కులు కోల్పోకూడదు. వచ్చే రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే చంద్రబాబు లక్ష్యం. రాష్ట్రంలో కుంటుపడిన వ్యవస్థలను దారిలో పెట్టేందుకే బీజేపీతో పొత్తు. అధికారంలోకి రాగానే ప్రైవేట్ సెక్టార్ కు చేయూతనిస్తాం. కరోనా విపత్కార పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందజేస్తే మాపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఓటర్లు తప్పు చేయద్దండి. అన్ని వర్గాల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొస్తాం. కష్టంలో స్పందించడానికి ఎల్లవేళలా మేము అండగా ఉంటాము” అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వాల్మీకి స్కూల్ అధినేతలు పవన్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, జనసేన నాయకులు, బ్లూమూన్ విద్యా సంస్థల అధినేత శివ శంకర, ప్రయివేట్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.