Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంపయ్ సోరెన్

ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంపయ్ సోరెన్

ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఝార్ఖండ్ ముక్తి మోర్చా లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. తనకు ఎమ్మెల్యేల బలం ఉందని… కాబట్టి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని చంపయ్ సోరెన్ గవర్నర్‌ను కోరారు. ఈ క్రమంలో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఆయనతో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు.
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జేఎంఎం నేత, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేసిన నేపథ్యంలో బుధవారం చంపయ్ సోరెన్‌ను జేఎంఎం శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తాలు మంత్రులుగా ప్రమాణం చేశారు. త్వరలో అసెంబ్లీలో చంపయ్ సోరెన్ బలపరీక్ష ఎదుర్కోనున్నారు.
రెండు రోజుల క్రితం ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను ఏడు గంటల పాటు విచారించడం… ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయడం జరిగాయి. ఆ తర్వాత హేమంత్ ను అరెస్ట్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై రెండు రోజుల పాటు సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు చంపయ్ సోరెన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఝార్ఖండ్ శాసన సభలో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి 48 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. గురువారమే వీరు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శుక్రవారం వచ్చారు.
ప్రమాణ స్వీకారం అనంతరం ఝార్ఖండ్‌ కొత్త ముఖ్యమంత్రి చంపయ్‌ సోరెన్‌ మాట్లాడుతూ… హేమంత్‌ సోరెన్‌ గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ఆయన ప్రారంభించిన పనులను తాము వేగవంతం చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులను సకాలంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అస్థిరత సృష్టించాలని ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. తమ కూటమి వారి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article