209 పరుగులతో జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్
భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. ఇంగ్లండ్‍తో జరుగుతున్న రెండో టెస్టులో ద్విశతకంతో సత్తాచాటాడు. తన తొలి అంతర్జాతీయ డబుల్ సెంచరీకి చేరాడు. తన కెరీర్లో ఆరో టెస్టులోనే డబుల్ సెంచరీ చేసి గర్జించాడు 22 ఏళ్ల సంచలనం జైస్వాల్. భారత్, ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజైన నేడు (ఫిబ్రవరి 3) డబుల్ సెంచరీకి చేరాడు జైస్వాల్. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్లు బాది ద్విశతకానికి చేరాడు యశస్వి జైస్వాల్.
యశస్వి జైస్వాల్ మరోసారి తన తెగువ చూపాడు. 191 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఇంగ్లండ్ స్పిన్నర్ బషీర్ బౌలింగ్‍లో సిక్సర్ బాదేశాడు జైస్వాల్. డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నా ఔట్ భయం లేకుండా కొట్టేశాడు. ఫీల్డర్లు బౌండరీల వద్దే ఉన్నా ఆత్మవిశ్వాసంతో ధైర్యం చూపాడు. ఆ తర్వాతి బంతికే ఫోర్ బాదాడు జైస్వాల్. దీంతో డబుల్ సెంచరీకి చేరుకున్నాడు. గాల్లోకి ఎగిరి సెలెబ్రేట్ చేసుకున్నాడు. డెస్సింగ్ రూమ్‍కు, ప్రేక్షకులకు అభివాదం చేశాడు.
176 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నేడు రెండో రోజు ఆటకు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగాడు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. ఆత్మవిశ్వాసంతో ఆడుతూ తొలి సెషన్‍లోనే వేగంగా డబుల్ సెంచరీకి చేరుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‍లో 209 పరుగులకు (290 బంతుల్లో) జైస్వాల్ ఔటయ్యాడు. దీంతో యశస్వి అద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసింది.