వైసిపి పాలనతో రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి
సీ ఫోర్ భాష నన్ను ప్రశ్నిస్తే ఏం ప్రయోజనం
టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి
కడప అర్బన్
రాష్ట్రంలో ఐదేండ్లు అరాచక, విధ్వంస, నియంత పాలన కొనసాగించిన వైఎస్ జగన్, ఓటమి తప్పదనే, తట్ట, బుట్టా సర్దుకుని మేము సిద్ధం అంటున్నారని టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని అష్టలక్ష్మి కళ్యాణ మండపంలో ఆదివారం టిడిపిలోకి యువత చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. ఓటమి చెందుతామన్న భయంతో జగన్ ,మతిస్థిమితం కోల్పోయి శాసనసభ్యులను బదిలీ చేస్తున్నారని ఆయన చమత్కరించారు. గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి ఎమ్మెల్యేగా గెలిచి, అందినంత దోచుకుని నాపై విమర్శ లా అని నిలదీశారు. కలెక్షన్, కమిషన్, కబ్జా, కటింగ్ భాషాగా, కడపలో ఆయన పేరు పొందాలని పరోక్షంగా ఎమ్మెల్యే అంజద్ భాషా పై విరుచుకుపడ్డారు. భూ కబ్జాలు, దౌర్జన్యాలు ప్రశ్నిస్తే కేసులు పెడతారా అన్నారు. కబ్జాల పంపిణీలో తేడాలు వచ్చి కడపలో హత్యలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యే కాదని, ఎంపీగా గెలవలేదని, నన్ను ప్రశ్నిస్తే ఎలాగయ్యా, ప్రయోజనం ఉండదన్నారు. కడప ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా కడపను ఏం అభివృద్ధి చేశారని, అడిగే హక్కు నియోజకవర్గ ప్రజలకు ఉంటుంది అన్నది, ఆయన గ్రహించాలని చెప్పారు. డిబేట్ కు వస్తే, తమరు చేసిన అభివృద్ధి, మేము చేసిన అభివృద్ధి నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. వక్స్ బోర్డ్ ఆస్తులన్నీ అమ్ముకున్న ఎమ్మెల్యే హైదరాబాద్ కు మకాం మార్చేశారని అన్నారు. యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు అనే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. టిడిపిలో చేరుతున్న యువతకు పార్టీ అధికారంలోకి రాగానే పరిశ్రమలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని యువతకు భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలోనే అభివృద్ధిలో కడప నియోజకవర్గం: రెడ్డప్ప గారి మాధవి
టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఆదరించి రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే, రాష్ట్రంలోనే అభివృద్ధిలో నియోజకవర్గం ముందుంటుందని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో కుటుంబ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రజా వేదికను కూల్చారు, తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జ్ పెంచారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఉన్న పరిశ్రమలను బెదిరించి పారిపోయేలా చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అంజద్ భాష కు మహిళల పట్ల గౌరవం లేదని, ఇటువంటి వ్యక్తి తిరిగి మనకు అవసరమా అని ఆమె ప్రశ్నించారు, ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ప్రజల ఆస్తులు కబ్జా చేసింది అందరికీ తెలిసిందే అన్నారు. మొదటిసారి గెలిచినప్పుడు అంజద్ భాష అప్పు ఎంత, రెండోసారి గెలిచి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఆమె సూటిగా ప్రశ్నించారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్, హరి ప్రసాదులు మాట్లాడుతూ రవీంద్ర నగర్ బ్రిడ్జి ఏర్పాటు చేయలేని పరిస్థితి అంజద్ భాష ది అన్నారు. అభివృద్ధి చేయలేకపోయామని వైసిపి నాయకులు సిగ్గుపడాలన్నారు. వైసిపి ప్రజా వ్యతిరేక పాలనతో విసిగి వేసారి పోయిన ప్రజలు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులకు విజయం చేకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టిడిపి అనుబంధ సంస్థ, తెలుగు నాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందన్నారు. టిడిపి గెలుపుకు రానున్న ఎన్నికల్లో యువత క్రియాశీలకంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.