కొండా రాజేశ్వరరావు
సీనియర్ జర్నలిస్టు
<><><><><><><><><>
రాజకీయ రాజధానిగా పరిగణించే విజయవాడ అర్బన్ లో మార్పులు అనివార్యంగా మారాయి. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కు అసలు సీటు ఇచ్చే అవకాశాలు లేనట్లేననేది ఆయన మంత్రి పదవి అనంతరం అందరికీ తెలిసిన మాటే. కానీ వెల్లంపల్లికి సీఎం జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా స్థాన చలనం అనేమాట పెద్దగా బయటకు రాలేదు. సరికదా ఈ పశ్చిమ నియోజ కవర్గంలో ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి మళ్లీ వెంటనే రెండోసారి వచ్చే ఎన్నికలలో ఆ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో గెలిచిన దాఖలాలే లేవు. అంతే కాకుండా రాష్ర్ట దేవదాయదర్మాదాయ శాఖ మంత్రిగా చేసిన వారు ఆ తర్వాత వచ్చే ఎన్నికలలో తప్పకుండా ఓడిపోతారు. ఇది ఎన్నికల చరిత్ర చెబుతున్న వాస్తవం. ఆ చరిత్రను తిరగ రాస్తామని చాలామంది నాయకులు వచ్చి పోటీచేసి చతికిల బడ్డవారే అందరూ. అందుకనే వెంటనే కాకుండా మారో టర్మ్ ఆగి పోటీ చేస్తే మళ్లీ గెలిచే అవకాశాలు ఉన్న ఏకైక నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజక వర్గం మాత్రమేనని జగమెరిగిన సత్యం. అందుకు బిన్నంగా వెళతానంటే కనీసం డిపాజిట్లు కూడా దక్కని దుస్థితి కూడా లేకపోలేదు. అందుకే విజయవాడ పశ్చిమం ఓటర్లతో జర భద్రంగా ఉండటమే మేలు అనిపిస్తుంది. ఇక నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లో చర్చించారనే విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న వెల్లంపల్లితోనే తన కార్యకలాపాలు మొత్తం చక్కదిద్దుకునే మేయర్ ఎమ్మెల్యే గా ప్రజలకు అంతగా నచ్చే పరిస్థితులలో లేదు. ఎందుకంటే నగరంలో ఎక్కడికి వెళ్లినా రిబ్బన్ కటింగ్, వివాహాలు, పండుగలు పబ్బాలు మినహా పార్టీ పరంగా ఓ మేయర్ గా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకునే విధంగా సాధించినది ఏమీ లేకపోవడం అసలు ఆమె సొంత వార్డుకే గతంలో ఉన్న ఒక సొంత క్యాడర్ ను దూరంగా పెట్టడం ఇపుడు వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ నగరం అంటేనే రాజకీయ,కళా రంగాలకు పుట్టినిల్లు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయం. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఉన్న పదవి నిలబెట్టుకోవడమే కష్టంగా మారిని నేపథ్యంలో మరో కొత్త పదవి ఆశించి రాణించాలంటే ఎన్నో రకాల మెళకువలు, అందరితోనూ ఆత్మీయంగా మెలిగే మనస్తత్వం కలిగి ఉండాలి. కానీ నగర మేయర్ వద్ద ఆ పాళ్లు చాలా తక్కువగానే ఉంటాయని అందువల్లే ఆమెకు సొంత క్యాడర్ కూడా లేకుండా పోయిందనే అపవాదును మూటగట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా మాజీ ఎమ్మెల్యే మరుపిళ్ల చిట్టిగారి విగ్రహాన్ని చిట్టినగర్ సెంటర్లో కట్టడం పలు వివాదాలకు దారి తీస్తుంది. విజయవాడ లోని ఏనాలుగు రోడ్ల కూడలి లోనూ ఎలాంటి విగ్రహాలు పెట్టవద్దని, అనుమతి లేకుండా కట్టినా వాటిని కూల్చి వేయవచ్చనే ఆదేశాలు సుప్రీం కోర్టునుంచే ఉన్నాయని గతంలో ఎన్నో విగ్రహాల ఏర్పాట్లకు నగర ప్రజల నుంచి వచ్చిన అభ్యర్ధనలు నగరపాలక సంస్థ అధికారులు తోసిపుచ్చారు. అలాంటిది ఇప్పటికిప్పుడు చిట్టిగారి విగ్రహం చిట్టినగర్ సెంటర్లో నెలకొల్పడం ఇతర వర్గాలను ఆలోచింపచేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ స్థలంలో మరో విగ్రహ ఏర్పాటుకు అక్కడ ఉన్న అంబేద్కరిస్టులు నెలకపలొల్పాలనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే గతం నుంచే అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది. రోడ్డు వెడల్పు చేసే అంశంపై ఆ విగ్రహాన్ని పక్కకు తొలగించారు. ఇలా ఆ ప్రాంతంలో విగ్రహాలు పెట్టుకుంటూ పోతే తోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలే ఇక్కడ సెంటర్ చాలా చిన్నది. దానికి తోడు విగ్రహాల వివాదం ముదిరితే అంతా శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంటుంది. ఈ ఎన్నికలలో ఈ విగ్రహాన్ని నెలకొల్పి అనవసర రాజకీయ ప్రతిఘటనలకు దారి వేసినట్టు అయ్యిందని ప్రజలు అంటున్నారు. ఇక మాజీమంత్రి వెలంపల్లిని విజయవాడ సెంట్రల్కు మార్చే అవకాశం ఉందంటున్నారు. ఆయన పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలను పట్టించుకున్న దాఖలాలే లేవు. ఆయన సొంత కోటరీకి తప్ప సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడనే అపవాదులే ఎక్కువ ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కావడం ఇంటి దగ్గరే దుర్గగుడి ఉండటం ఆయనకు మాత్రమే ప్లస్ పాయింట్ అయ్యింది. దాంతో గుడిమీద ఆయన చెప్పిందే వేదంగా మారింది. దాంతో అనేక రకలుగా జరిగిన అక్రమాలలో ఆయన పాత్ర ఉందనే విషయంపై అధిష్టానం కూడా విచారణ చేసి మంత్రి పదవినుంచి పక్కకు పెట్టారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే పశ్చిమలో ఒక విద్యా సంస్థ రాకేష్ యజమాని పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వెలంపల్లి సజ్జలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదేమైనా అభ్యర్థి మార్పు తప్పదు కానీ పార్టీ విధివిధానాలు తెలియని అభ్యర్థులకు సీటిచ్చి పోగొట్టకోచడం కంటే పుణ్యశీల వంటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఆమెకు సీటు ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయనేది పార్టీ వర్గాల సామూహిక అభిప్రాయంగా ఉంది. వెల్లంపల్లి కి సెంట్రల్ కేటాయిస్తే వచ్చే ముప్పు మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. కాగా వెల్లంపల్లి కి సీటు ఇవ్వాలంటే ఆర్యవైశ్య సంఘం నుంచి రికమెండేషన్ లెటరు కూడా అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాదిని ఈ నియోజకవర్గం మార్చితే ఎక్కడ పోటీ చేయనున్నారో ఇంకా దిశానిర్దేశం లేదు. ఈ క్యాండిడేట్ మార్పుల విషయం మల్లాది పరిగణలోకి తీసుకుంటున్నట్లు ఎక్కడా కూడా కనపడటం లేదు. చేయమంటే చేద్దాం లేదంటే వదిలేద్దాం అనే దృక్పథంతోనే ఉన్నట్టు ఆయన సన్నిహితులు ద్వారా తెలుస్తోంది. తూర్పు నియోజకవర్గం వచ్చే సరికి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. దేవినేని అవినాష్ ఇంఛార్జ్ గా ఇక్కడ పార్టీ కార్యకలాపాలు చేసుకొచ్చారు. పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారు. అయితే అనుకోని ట్విస్ట్ జరిగితే అవినాష్ కంకిపాడు నియోజకవర్గానికి మారాల్సి వస్తుందనే ఊహాగా నాలు వినవస్తున్నాయి. అందువల్ల విజయవాడ అర్బన్ లోని మూడు నియోజకవర్గాల లోని ఏ అభ్యర్థికీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ధీమా లేకుండా పోయింది. దీంతో అభ్యర్థులకు ఎలక్షన్ ఫోబియోతో కొట్టుమిట్టాడుతున్నారు.