కర్నూలు జిల్లాలో ఓ పెళ్లి పీటలపై ఆగిపోయింది. ఓ ఫోన్ కాల్ రావడంతో ఉన్నట్టుండి వివాహ వేడుకను నిలిపివేశారు. వరుడి గురించి అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు. వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన యువకునికి.. కర్నూలుకి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. కట్నకానుకలు భారీగా ఇచ్చారు.. రామళ్లకోట టు వెల్దుర్తి రోడ్డులోని బ్రహ్మగుండం క్షేత్రంలో ఈ నెల 20వ తేదీన ఉదయం 9గంటలకు పెళ్లికి ముహూర్తం కుదిరింది. వధూవరులు, కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం రాత్రి బ్రహ్మగుండం చేరుకున్నారు. బుధవారం ఉదయం పెళ్లి తతంగం ప్రారంభమైంది. వధువు, వరుడు పెళ్లి పీటల మీదకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో వరుడు వధువు మెడలో తాళి కడతాడనుకుంటున్న సమయంలో ఓ వార్త తెలిసింది. వరుడు తనతో సహజీవనం చేస్తున్నాడంటూ.. విశాఖపట్నం నుంచి ఓ మహిళ కాల్ చేసింది. తనది అల్లూరి సీతారామరాజు జిల్లా అని.. తనను వరుడు మహేంద్రనాయుడు పెళ్లి చేసుకున్నాడని ఫొటోలు పంపించింది. పెళ్లి కుమారుడి బాగోతం బట్టబయలు కావడంతో.. పెళ్లిని పీటలపై ఆపేశారు. పెళ్లికుమారుడు మహేంద్రనాయుడు, అతడి కుటుంబ సభ్యులపై పెద్దలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేంద్రనాయుడు విశాఖ పోర్టులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతడు మరో మహిళతో సహజీవనం చేస్తూ వచ్చాడట.. పెళ్లి చేసుకుంటానంటూ ఆమెకు చెప్పాడు. అయితే ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధం కావడంతో ఈ విషయం ఆ మహిళకు తెలిసింది.. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆ తర్వాత పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. పీటలపై పెళ్లి ఆగిపోవడంతో పెద్ద గొడవే జరిగింది.. గ్రామ పెద్దలు, బంధువులు కలుగజేసుకుని.. పంచాయతీ పెట్టారు. వధువు కుటుంబసభ్యులు ఇచ్చిన కట్నకానుకలతో పాటు కొంత జరిమానా కట్టించేలా ఒప్పించి.. వరుడి కుటుంబంతో క్షమాపణలు చెప్పి పంపించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు విశాఖలో ఉంటున్న సదరు మహిళ కర్నూలుకు బయల్దేరి వెళ్లింది. మరోవైపు వరుడిపై మరికొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.