తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు శివప్రసాద్‌రెడ్డి , శివప్రసాద్‌పై వేటు వేసింది. తూర్పు పీఎస్ ఎస్సై జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్ ద్వారకానాథ్‌రెడ్డిని సస్పెండ్ చేసింది. అలిపిరి అప్పటి సీఐ దేవేంద్రకుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేసింది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక సమయంలో నమోదైన దొంగ ఓట్ల కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేవని పోలీసులు ఈ కేసులను మూసివేశారు.తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక సమయంలో ఒకే ఐడీ నుంచి 34 వేల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాల ఫిర్యాదుతో అప్పట్లో పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. ఓటర్ ఎపిక్ కార్డులు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసివేశారని పోలీసులపై ఈసీ చర్యలు తీసుకుంది. ఈసీ ఆదేశాలతో అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.