విశాఖపట్నం జిల్లా:
వివాహిత వెంటబడి వేధిస్తున్న ఆకతాయి ఆట కట్టించారు దిశ పోలీసులు. ఇద్దరు పిల్లలున్న గృహిణి వెంటపడడంతో పాటు, తనను పెళ్లి చేసుకోవాలని ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. తీవ్ర మానసిక వేదనకు గురైన మహిళ దిశ యాప్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా మువ్వలవాని పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత మహిళ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
మువ్వలవాని పాలెం లోని ఓ రెస్టారెంట్ లో బాధిత మహిళ పనిచేస్తోంది. అదే హోటల్లో పనిచేసే సుమిత్ కుమార్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా మహిళ వెంటపడి వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని మహిళను తీవ్ర ఇబ్బందులకు గురిచేసాడు. తనకు పెళ్లయిందని బాధిత మహిళ ఎంత చెప్పినప్పటికీ పట్టించుకోకుండా సుమిత్ వేధించసాగాడు. ఈ క్రమంలో సోమవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న బాధిత మహిళను సుమిత్ కుమార్ అడ్డగించి భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో బాధిత మహిళ దిశా యాప్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.
బాధిత మహిళ నుండి ఫిర్యాదు అందిన ఎనిమిది నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి దిశా పోలీసులు చేరుకున్నారు. మహిళ వెంటపడి వేధిస్తున్న సుమిత్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మువ్వలవాని పాలెం పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తెలియక తప్పు చేశానని, క్షమించాలని సుమిత్ కుమార్ మహిళను ప్రాధేయపడ్డాడు. బాధిత మహిళ సూచన మేరకు సుమిత్ కు దిశ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మరొకసారి మహిళ వెంటపడి వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దిశ యాప్ కు కాల్ చేసిన వెంటనే పోలీసులు తక్షణం స్పందించి తన సమస్యను పరిష్కరించినందుకు బాధిత మహిళ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.