బుట్టాయగూడెం.
దేశాభివృద్ధికి విద్యారంగమే కీలకమైనదని, చదువుకున్న యువత దేశానికి సంపద లాంటి వారిని పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని దొరమామిడి ఉన్నత పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ దొర మామిడిలో గిరిజన బాలురకు, తెల్లం వారి గూడెంలో గిరిజన బాలికలకు ఉన్నత పాఠశాలలు ఉన్నాయని మిగిలిన విద్యార్థులకు ఉన్నత పాఠశాల లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవలసి వస్తుందని అన్నారు. విద్యార్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉన్నత పాఠశాలను మంజూరు చేయించినట్లు తెలిపారు. వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు విద్య పదునైన ఆయుధమని, విద్యావంతులైన యువత దేశ సంపద అన్నారు. ఇదే పాఠశాలలో తాను ఉపాధ్యాయురాలుగా పనిచేసి, రాజకీయరంగంలో అడుగుపెట్టినట్లు చెప్పారు. దొరమామిడి పంచాయతీ అభివృద్ధి బాధ్యత అని, రాజకీయంగా తమ కుటుంబానికి ఓనమాలు దిద్దిన రాజకీయ పాఠశాల అని అన్నారు. రాజ్యలక్ష్మి మామగారు తెల్లం చిన్న వడ్డీ దొర మామిడి వార్డు మెంబర్ నుండి రాజకీయ జీవితం ప్రారంభించారని తెలిపారు. ఆయన ఆశయం మేరకే తన భర్త తెల్లం బాలరాజు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్నారని అన్నారు. అదే బాటలో తాను కూడా రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టానని, ప్రజలందరూ తనను కూడా ఆశీర్వదించాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారి తెల్లం బాబురావు మాట్లాడుతూ పాఠశాల వర్గోన్నతికి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎంతో కృషి చేశారని, ఎన్నో అవాంతరాలను, అడ్డంకులను అధిగమించి అనుమతులు మంజూరు చేయించారని తెలిపారు. విద్యార్థులకు ఈ పాఠశాల వర్గోన్నతి ఎంతో ప్రయోజనకరమని, విద్యార్థులు 1 నుండి 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో విద్యను అభ్యసించే అవకాశం కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజును, వైసీపీ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖ ఘనంగా సన్మానించారు. అనంతరం ఉన్నత పాఠశాల తరగతి గదులను ఎమ్మెల్యే బాలరాజు, తెల్లం రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లం రాముడు, జడ్పిటిసి మొడియం రామ తులసి, ఎంపీపీ కారం శాంతి రమణ, వైస్ ఎంపీపీలు గుగ్గులోతు మోహనరావు, కుక్కల జయలక్ష్మి, బుట్టాయిగూడెం సొసైటీ అధ్యక్షుడు ఆరేటి సత్యనారాయణ, వైసిపి గ్రామకమిటీ అధ్యక్షుడు పాకిరం శ్రీనివాసరావు, వైసీపీ నేతలు సోయం వెంకటరామయ్య, కాలింగి వెంకటేశ్వరరావు, అట్లూరి రమేష్, యువోపిఆర్డి శ్రీహరి, ఎంఈఓ 2 నరేంద్ర రాయ్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.