Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంనమో.. నారసింహా..!

నమో.. నారసింహా..!

-అంగరంగ వైభవంగా నృసింహుని బ్రహ్మ రథోత్సవం
-లక్షల్లో తరలివచ్చిన భక్తాదులు
-గోవింద నామస్మరణల మధ్య మార్మోగిన తిరుమాడ వీధులు

కదిరి:ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం (తేరు) శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవానికి తెలుగు రాష్ట్రాల నలమూలలనుండే కాక కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే స్వామివారిని రథోత్సవంలోకి తీసుకొచ్చారు. రథం కదలకముందే వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు నిర్ణయించిన ముహూర్తానికి తేరును లాగారు. గోవింద నామస్మరణల మధ్య రథోత్సవం ముందుకు సాగింది. ఎమ్మెల్యే డాక్టర్ పీ.వీ. సిద్దారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.యస్. మక్బూల్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, వైకాపా రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు తేరును లాగారు. కందికుంటతో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, యువమోర్చా నాయకులు వంశీలు తీరుకు తెడ్లు వేసే భక్తులకు సూచనలు ఇచ్చారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ వెండిదండి శ్రీనివాస రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు రథోత్సవం వెంట వుండి ఎప్పటికప్పుడు తాళ్ళు, మొద్దులు సమకూర్చారు.

బ్రహ్మ రథోత్సవానికి తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం పలువురు అన్నదాన కేందాలు ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. పోటెత్తిన భక్తులు:-అందరూ వేయి కళ్ళతో ఎదురు చూసిన ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మ రథోత్సవం శనివారం అశేష భక్తజన సందోహం మధ్య సాగింది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం ఇది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారుల అంచనా. తేరు సందర్భంగా ఆలయ ప్రాంగణంతో పాటు తిరు వీధుల గుండా ఉన్న భవనాలు భక్తులతో కిటకిటలాడిపోయాయి. ఆలయ ప్రాంగణంలో కాలు మోపేందుకు చోటులేదు. బ్రహ్మోత్సవాల్లో నారసింహుడు తిరు వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించడానికి దేవతలు తమ తమ వాహనాలను పంపుతారని భక్తుల నమ్మకం. సాక్షాత్తు బ్ర హ్మదేవుడే శ్రీవారి రథోత్సవం నాడు రథాన్ని నడిపి స్వామి వారు విహరించడానికి సహకరిస్తారని, అందుకే బ్రహ్మ రథోత్సవం అంటారని ప్రధాన అర్చకులు పార్థసారథిచార్యులు, నరసింహాచార్యులు చెబుతున్నారు.

తెల్లటి ఐరావతంపై శుక్రవారం రాత్రి విహరించిన శ్రీవారు తిరిగి యాగశాలను చేరుకొని, తెల్లవారుజామున రథారోహణం గావించారు. శ్రీదేవి, భూదేవిలను కంకణ భట్టాచార్యులు తీసుకొని వచ్చారు. శ్రీదేవి భూదేవిల సమేతంగా బ్రహ్మ రథంపై శ్రీవారు లక్షలాది మంది భక్తాదులకు దర్శన భాగ్యం కలిగించారు. రథోత్సవంలో ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భారీ బ్రహ్మ రథంపై కొలువు దీరి తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. తమిళనాడు అండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూర్ జిల్లాలోని తిరువార్ రథం తర్వాత దేశంలో అతిపెద్ద రథంగా కదిరి తేరు ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలో అతిపెద్ద బ్రహ్మ రథం ఇదే. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది.

రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 120 ఏళ్ల క్రితం తయారు చేసిన రథం చక్రాలు ఒక అడుగు, ఒక అంగుళం వెడల్పుతో పాటు 8 అడుగుల డయామీటర్‌తో ఉన్నాయి. ఇవి 7 ఏళ్ల క్రితం బ్రహ్మ రథోత్సవం నాడు మరమ్మతుకు రావడంతో వీటి స్థానంలో 5 సంవత్సరాల క్రితం జరిగిన బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఆధ్వర్యంలో కొత్త చక్రాలను అమర్చారు.

రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా చెక్కారు. వివిధ భంగిమల్లో చెక్కిన ఈ బొమ్మలు అప్పటి శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనం. ఇలాంటి అపురూప రథోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలలనుండే కాక పొరుగు రాష్ట్రాలైనా కర్ణాటక, తమిళనాడు నుండి శుక్రవారం రోజే పెద్ద ఎత్తున భక్తాదులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కాలు మోపేందుకు చోటులేక భక్త జనంతో పోటెత్తింది. ఆలయంలోని అద్దె గదులతో పాటు పట్టణంలోని అన్ని లాడ్జిలలో గదులు ఖాళీ లేవనే సమాధానమే భక్తులకు ఎదురయ్యింది.

నెల రోజులకు ముందే లాడ్జిలలో గదులు బుక్ చేసుకున్నారు. చేసేది లేక భక్తులు ఆలయ ప్రాంగణంలోనే కటిక నేలపై నిద్రించడం కన్పించింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా హరికథలు, బుర్రకథలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article