శాసనమే స్మశానమై..
కార్యనిర్వహణలో
పిశాచాల ఊళ..
న్యాయవ్యవస్థకే తప్పిపోతున్న కళ..
మొత్తంగా ప్రజాస్వామ్య పునాదులే కూలుతున్న వేళ
ఇంకెక్కడి పత్రికా స్వేచ్ఛ..
ఇప్పుడేమి రాసినా రచ్చరచ్చ!
అక్షరమిపుడు
ఎవరి చేతిలో బందీ..
ఎవరు చేస్తున్నారో జమాబందీ..
ఏ నిరంకుశ హస్తంలో
కలం బందీ..
అక్షరం శిలాక్షారమైన
రోజులు చెల్లిపోయె..
యాజమాన్యాల
స్వార్థ సంకెళ్ళ నడుమ
వార్త.. కర్తనే కోల్పోయి
ఖర్మ కాలి క్రియాహీనమై
వగచుచున్నాది చూడు!
నువ్వు రాసే న్యూస్..
మరొకరి వ్యూస్..
ఇంకొకరి లాస్..
నీ న్యూస్
ఇంకొకరికి న్యూసెన్స్..
నీ యజమానికేమో నాన్సెన్స్..
ఇంకెక్కడి నీ సిక్స్త్ సెన్స్..
కరవై ఎసెన్స్..
దిగజారిపోయి దాని సెన్సెక్స్!
కత్తి కంటే కలం పదు’నై’నది
అది నాటి మాట..
ఇప్పుడది నీటి మూట…
సొమ్ములెటూ కరవే…
బ్రతుకు బరువే..
అయినా నాలుగు అక్షరం ముక్కలు రాస్తే అదో తుత్తి..
అదీ ఉత్తిమాటే..!
పెన్ను తియ్యాలంటే భయం
రాబందుల రాజ్యంలో
స్వేచ్ఛ పూజ్యమై..
పెత్తందార్ల ఇష్టారాజ్యమై
రాసే స్వేచ్చ..కూసే ఇచ్చ
రెండూ డొల్ల..
ఈ వ్యవస్థ బాగుపడడం కల్ల!
అక్షరాలకు ఆంక్షల సంకెళ్లు..
వార్తలకు నిబంధనల బం’ధనాలు’..
నువ్వు రాసే వార్త
ఒకరికి సానుకూలం
మరొకరికి ప్రతికూలం..
ఈ సానుకూలం..ప్రతికూలం
నడుమ నలిగిపోయే నీ కలం
ఇది కాదోయ్
నిజాయితీకి కాలం..
యజమానికి నచ్చకపోతే..
అతడి నేత మెచ్చకపోతే..
నీ రాత..
ఆ సాయంకాలం పత్రికలో
కనిపించదే నీ కాలం..
ఇదే ఇదే కలికాలం…!
ఇంకేం చెబుతుంది
నీ మనసాక్షి..
అజమాయిషీ చెలాయిస్తుంటే
పెత్తందారీ ‘సాక్షి’..!!??
అన్నట్టు..
నాణేనికి రెండో వైపూ
ఉందోయ్..
నీకూ ఉండాలోయ్
స్వీయ నియంత్రణ..
నీ ఇచ్చ స్వేచ్చ కాదు..
నీ రాతకు స్వచ్ఛత..
నీకు నిబద్ధత..
అనివార్యం..
అప్పుడే నీ కలానికి..
మన కులానికి మర్యాద..
వలదయ్యా మనకీ
అవినీతి వరద!
ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286