కలెక్టర్ వి.విజయ్ రామరాజు
కడప బ్యూరో:త్వరలో ఎన్నికల షెడ్యూలు రానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని రకాల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల సన్నద్ధతతో పాటు.. ప్రభుత్వ లక్ష్యం మేరకు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తెలిపారు. శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి రెవెన్యూ, రీసర్వే మూడవ దశ, ఇనామ్, అసైన్డ్ భూములు, హౌస్ సైట్స్ రిజిస్ట్రేషన్స్, పీ అండ్ ఆర్డీ, ఎన్ఆర్ఈజిఎ – కరువు మండలాల్లో వేజ్ జనరేషన్, తాగునీరు, పరిశ్రమల శాఖ – ఎంఎస్ఎంఈ క్లస్టర్ లకు భూమి కేటాయింపు, వైద్య ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం, తదితర అంశాలపై.. అన్ని జిల్లాల కలెక్టర్ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సమావేశానికి కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు, జేసీ గణేష్ కుమార్, డిఆర్వో గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రయారిటీ సెక్టార్ల వారీగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వివరించారు. రానున్న ఎన్నికలను జిల్లాలో సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సార్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నుండి రోజువారీ ప్రగతిని నమోదు చేస్తున్నామన్నారు. నేటి నుండి జిల్లాలో ఎంఎస్ఎంఈ ల సర్వేని కూడా ప్రారంభిస్తున్నామన్నారు. అలాగే.. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనుల లేబర్ కాంపోనెంట్, కూలీలకు కొరత లేకుండా తాగునీటి సదుపాయం, అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు.
ఎంఎస్ఎంఈ సర్వే పోస్టర్ల ఆవిష్కరణ..
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా.. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈల సర్వేకి సంబంధించి.. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ – ఎంఎస్ఎంఈ సర్వే, సపోర్ట్ అనే ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు సంబందిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ సుధాకర్ రెడ్డి, డ్వామా పీడీ యదుభూషన్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. వీరన్న డిఎంహెచ్ఓ డా౹౹ నాగరాజు, ఏపిఐఐసి జెడ్ ఎం శ్రీనివాస మూర్తి, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.