తెలుగు పదానికి జన్మదినం
జానపదానికి జ్ఞానపధం..
అన్నమయ్య కీర్తనలతోనే
నిత్యం ప్రతిధ్వనించు
విష్ణుపథం..!
ఒకటా..రెండా..
ముప్పై రెండు వేల సంకీర్తనలు..
శ్రీనివాసుని ప్రాంగణంలోనే
ఆ పదకవితా
పితామహుని నర్తనలు..
నీకైనా..నాకైనా తిరుమలగిరులను
అల్లంత దూరాన
దర్శించగనే
గుర్తొచ్చే పాట
అదివో అల్లదివో శ్రీహారివాసము..
పదివేల శేషుల
పడగల మయము…
అన్నమయ్య కీర్తనలతోనే
వేంకటపతి వశము..
ఆలపించినంతనే
ఒడలు పరవశము..!
తిరుమల గిరులలో
ప్రతి చెట్టు..
మహారుషుల ప్రతిరూపాలట
అక్కడ ఎల్లెడలా
కనిపించేది
అన్నమయ్య ఉనికే..
వినిపించేది
అన్నమయ్య పాటే..!
తాళ్ళపాక వారి కీర్తనతోనే
తిరుమల ప్రవేశం…
అలిపిరిలో మొదటి మెట్టు
అధిరోహం..
అన్నమయ్య పాట ఆరోహం..
శేషాద్రి..నీలాద్రి..గరుడాద్రి..
అంజనాద్రి..వృషభాద్రి..
నారాయణాద్రి..
కడపటిగా వెంకటాద్రి..
ఒక్కో కొండా ఎక్కుతూ
ఆ కడపరాయుడి కీర్తనలతోనే వేంకటరాయుని
స్తుతి..ప్రస్తుతి..సన్నుతి..
అంతిమంగా
ఆదుకొమ్మనే విన్నుతి..
మానవ జీవితానికి పరిణితి!
తెలిసీ తెలియని వయసులోనే తెలియకుండా
మనమంతా వినలేదా
అమ్మ పాడుతుంటే
అన్నమయ్య పాట..
చందమామ రావే..
జాబిల్లి రావే..
జీవితాన ఏదో ఒక దశలో
వచ్చే ఆలోచన ఆ కీర్తన
అలల చంచలమైన
ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల..
పలుమారు ఉచ్వాసపవనమందుండ
నీ భావంబు
తెలిపెనీ ఉయ్యాల..
అన్నమయ్య కీర్తన
నీ రుజువర్తన..
నీ బ్రతుకున ఆలన..
నీ కష్టాన లాలన..
నీ భక్తి భావన..
మొత్తంగా నీ జీవితానికే
ఆలంబన..!
కొండంత దేవుని
కొండంత భక్తితో కొలవలేకపోయినటుల
ముప్పై రెండు వేల కీర్తనల
పదకవితాపితామహుని
జయంతి సందర్భంగా
చంద్రునికి నూలుపోగులా
ఓ చిరు అక్షరమాల!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286