- ప్రజలకు పిలుపునిచ్చిన బొజ్జా దశరథరామిరెడ్డి
రాయలసీమ
మభ్యపరిచే పాలకుల చర్యలతో వెనుకబాటుకు గురైన రాయలసీమ అభివృద్ధికి కావలసిన వాస్తవమైన అంశాలను ప్రజలలోకి తీసుకొని పోవడానికి, తద్వారా ఈ అంశాల సాధనకు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి “రాయలసీమ నిజదర్శన దీక్ష” చేపట్టామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి వివరించారు. రాయలసీమ సాగునీటి హక్కులను తెలంగాణకు చెందేలాగా అక్టోబర్ 6న తీసుకొని వచ్చిన కేంద్ర నోటిఫికేషన్ రద్దు, రాయలసీమకు హక్కుగా ఉన్న కృష్ణా జలాల సమర్థవంత వినియోగానికి కార్యాచరణ, కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు, రాయలసీమ అభివృద్ధికి చెరువుల నిర్మాణం, రాష్ట్ర విభజన చట్టం హక్కులు కల్పించిన తెలుగు-గంగ, గాలేరు-నగరి హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం సత్వరమే పూర్తి చేయాల్సి ఉందన్నారు. వీటితో పాటు పట్టిసీమ ద్వారా ఆదా అయిన గోదావరి జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు చట్టబద్ధమైన కేటాయింపు, రాష్ట్ర విభజన చట్టం లోని పేర్కొన్న వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంతకల్లు రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారము, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉన్న తాత్కాలిక కలెక్టరేట్ తక్షణమే తరలించి వారసత్వ సంపదైన నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం పరిరక్షణ తదితర అంశాల సాధనకై నిజదర్శన దీక్ష చేపట్టడం జరిగిందని వివరించారు.
ఈ నెల (జనవరి) 27న నంద్యాల తాలూకా కార్యాలయం ఎదురుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే రాయలసీమ నిజదర్శన దీక్షలో రైతులు విద్యార్థులు, మహిళలు, కార్మికులు, వర్తకులు, రాయలసీమ ప్రజలు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.