వైఎస్ జగన్
ప్రజాభూమి ప్రతినిధి,విశాఖః
పాలనా వికేంద్రీకరణలో భాగంగా వైజాగ్ రాజధానికి తాను త్వరలోనే రాబోతున్నట్లు మరోసారి సీఎం జగన్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో తాను విశాఖలోనే కాపురం పెట్టబోతున్నట్లు ఇప్పటికే హింట్ ఇచ్చిన జగన్.. ఇవాళ భోగాపురం ఎయిర్ పోర్టు పనుల శంఖుస్ధాపన సందర్భంగా మరోసారి గుర్తుచేశారు. అలాగే చంద్రబాబు పాలనను తన పాలనతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుబంధంగా ఆరులేన్ల రహదారికి కూడా ఆరునెలల్లో శంఖుస్ధాపన చేయబోతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా వీటన్నింటికన్నా మించి గ్రామం నుంచి జిల్లా స్ధాయికి మాత్రమే కాకుండా రాజధాని స్ధాయికి కూడా తీసుకెళ్లాలనేది తమ ప్రభుత్వ విధానం అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమే కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం అని జగన్ తెలిపారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మీ బిడ్డ కాపురం ఉండబోయేది కూడా విశాఖలోనే అని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతం, గ్రామం, ఇంటిని చూసినా మీ బిడ్డ పాలనలో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడటం లేదని జగన్ తెలిపారు. చివరికి తమకు ఓటు వేశారో లేదా అనేది కూడా చూడటం లేదన్నారు. పేదలు, మధ్యతరగతికి అండగా నిలవడం కోసం అడుగులు వేస్తున్నట్లు జగన్ తెలిపారు. 47 నెలల్లో దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 2.10 లక్షల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి మీ ఖాతాల్లో వేశామన్నారు. ఎక్కడా లంచాల్లేవు, ఎక్కడా వివక్ష లేదని, గతానికీ, ఇప్పటికీ తేడా చూడాలని కోరారు. ఇప్పటి జగన్ కూ, గతంలో ఉన్న ఆ చంద్రబాబుకు తేడా కూడా స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రంలో పథకాలన్నీ మీకు అందాయా అని తాను అడగగలనని, గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారిని కూడా వారి గడప వద్దకు వచ్చి అంతా ఆప్యాయంగా వారిని అడగగలనని జగన్ తెలిపారు. మీ అన్న పాలనలో పథకాలు అంది ఉంటేనే, మంచి జరిగి ఉంటేనే, చంద్రబాబు పాలన కంటే మీకు మంచి జరిగిందని భావిస్తేనే నన్ను ఆశీర్వదించాలని జగన్ కోరారు. ఏ వర్గాన్ని చూసుకున్నా ఈ మాట గర్వంగా చెప్పగలుగుతున్నట్లు పేర్కొన్నారు.