అమెరికాలోని అలబామాలో ఒక హత్య కేసులో దోషిగా తేలిన కెన్నెత్ యూజీన్ స్మిత్ అనే వ్యక్తికి నైట్రోజన్ వాయువు ద్వారా మరణశిక్షను అమలు చేశారు. 1988 లో తన భార్యను పాస్టర్ కెన్నెత్ యూజీన్ స్మిత్ హత్య చేశాడు.
అలబామాలో పాస్టర్ గా పని చేస్తున్న కెన్నెత్ యూజీన్ స్మిత్ భారీగా పెరిగిన తన అప్పులను తీర్చడానికి తన భార్యను చంపి, అనంతరం వచ్చే బీమా డబ్బులను ఉపయోగించాలని ప్లాన్ చేశాడు. 1988 లో ఈ హత్య జరగగా, స్మిత్ కు 1996 లో కోర్టు మరణ శిక్ష విధించింది.
ఫేస్ మాస్క్ ద్వారా నైట్రోజన్ వాయువును పంపించి 58 ఏళ్ల కెన్నెత్ యూజీన్ స్మిత్ కు ఉరిశిక్ష అమలు చేశారు. ప్రస్తుతం1982లో ప్రవేశపెట్టిన ప్రాణాంతక ఇంజెక్షన్ ను ఇవ్వడం ద్వారా మరణ శిక్షను అమలు చేస్తున్నారు. కెన్నెత్ యూజీన్ స్మిత్ మరణ శిక్షను కూడా ఇంజెక్షన్ ద్వారా అమలు చేయాలని అలబామా జైలు అధికారులు ప్రయత్నించారు. కానీ ఐవి లైన్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో ఆ ప్రయత్నం విరమించారు.
నైట్రోజన్ ద్వారా మరణ శిక్షను అమలు చేయడానికి వ్యతిరేకంగా చివరి నిమిషం వరకు న్యాయపోరాటం జరిగింది. ఇది క్రూరమైన చర్య అని, రాజ్యాంగ ఉల్లంఘన అని ..కెన్నెత్ యూజీన్ స్మిత్ ను నైట్రోజన్ మరణ శిక్ష విధానానికి ప్రయోగ వస్తువుగా వాడుకుంటున్నారని అతడి తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ విధానంపై సరైన పరిశోధనలు జరగలేదని, ఈ విధానాన్ని అమలు చేస్తున్న సమయంలో శిక్షకు గురవుతున్న వ్యక్తి అనుభవించే బాధ ఏ స్థాయిలో ఉంటుందన్న విషయంలో శాస్త్రీయ సమాచారం లేదని వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కానీ, చివరకు సుప్రీంకోర్టులో ఓడిపోయారు.