బుట్టాయగూడెం
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, సమస్యల పరిష్కారం కోసం అనుక్షణం పనిచేసే పత్రిక విలేకరులపై కొందరు దాడులకు పాల్పడడం అనైతికమని బుట్టాయగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు లో ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ బి.కృష్ణ పై జరిగిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి జక్కుల దాసు మాట్లాడుతూ విలేకరులపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు విలేకరుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. సమాజ హితం కోసం విలేకరులు స్వేచ్ఛపూరిత వాతావరణంలో పని చేసే విధంగా పరిస్థితులు ఉండాలని కోరారు. అనంతరం విలేకరుల ఐక్యత వర్ధిల్లాలి, విలేకరులపై దాడులు అరికట్టాలి, జరిగిన దాడులపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ మేరకు వినతి పత్రాన్ని డిప్యూటీ తహసిల్దార్ కె. రమేష్ కు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు మామిడిశెట్టి శ్రీరాం ప్రసాద్, శీలం కృష్ణమోహన్ , నూకల కాంతినాథ్, పాముల మురళీకృష్ణ, షేక్ బాబ్జి, గంజి మధుబాబు, కారం భాస్కర్, సరియం రామకృష్ణ, మర్రి రమేష్, నిట్టా రవి, తదితరులు పాల్గొన్నారు.