-యూపీఏ హాయాంలో ఆర్థిక దుర్వినియోగం
-పార్లమెంటులో దేశ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ పాలన ఉన్న పదేళ్ల ఆర్థిక పనితీరును.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ 10 సంవత్సరాల ఆర్థిక పని తీరును పోల్చడానికి తాము శ్వేతపత్రం విడుదల చేస్తామని ఫిబ్రవరి 1న సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో నిర్మల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం నేడు శ్వేత పత్రం విడుదల చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు.
యూపీఏ హాయాంలో ఆర్థిక దుర్వినియోగం, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం ఉందని, అవినీతి బాగా జరిగిందని నిర్మల వివరించారు.
నిర్మలా సీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు
సత్వర ఉపశమన విధానాలు అమలు చేయడానికి బదులుగా ఎన్డీఏ ప్రభుత్వం దీర్ఘకాలిక ఫలితాలు చూపే ధైర్యమైన సంస్కరణలను చేపట్టింది. ధృడమైన సూపర్ స్ట్రక్చర్‌ను నిర్మించింది. రాజకీయ విధాన సుస్థిరతతో ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం తరహాలో కాకుండా మరింత ఆర్థిక ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడడం.. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ పెట్టుబడులను ఆకర్షించడం, అవసరమైన సంస్కరణలకు మద్దతు ఇవ్వడం ఎన్డీఏ పాలనలో జరిగిన ముఖ్యమైన అంశాలు. యూపీఏ ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో ఘోరంగా విఫలం అయింది. దానివల్లే ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. గత పదేళ్లలో, గత యూపీఏ ప్రభుత్వం మిగిల్చిన ఎన్నో సవాళ్లను ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించింది.
మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశాన్ని స్థిరమైన అధిక వృద్ధి మార్గంలో నడిపిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం అనేది యూపీఏ ప్రభుత్వ హయాంలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి. ఇది ఆ కూటమిని బాగా అపఖ్యాతి పాలు చేసింది. ఆ సమయంలోనే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ దారుణమైన స్థితిలో ఉండేది. ఆర్థిక దుర్వినియోగం, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం, బాగా అవినీతి జరిగాయి. 2014లో కొత్తగా ఎన్నికైన యూపీఏ ప్రభుత్వం.. అధికార బాధ్యతలు చేపట్టేనాటికి భారత ఆర్థిక వ్యవస్థ అట్టడుగు స్థాయిలో ఉంది. దీని పునాదులను స్థిరంగా నిర్మించడానికి.. ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధిని ప్రారంభించడానికి పునర్ నిర్మించాల్సి వచ్చింది. 2014కు ముందు ఏర్పడిన ప్రతి సవాలును ఎన్డీఏ ప్రభుత్వం తన ఆర్థిక క్రమశిక్షణ, పాలన ద్వారా అధిగమించింది.