హిందూపురం టౌన్
ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు, అయితే వారి నడుమ వివాహమైన కొంతకాలానికి బేధాభిప్రాయాన్ని చోటుచేసుకున్నాయి. దీంతో వేరువేరుగా నివాసం ఉన్నారు. ఆ తర్వాత భార్య కావాలని భర్త, తనకు భర్త వద్దంటూ విడాకుల కోసం భార్య కోర్టులో పరస్పరం కేసులు దాఖలు చేసుకున్నారు. అయితే కోర్టులో వాయిదాల కోసం అటు న్యాయవాదులు ఇటు వారి కుటుంబ సభ్యుల ప్రేరణతో తిరిగి వారు ఒక్కటయ్యేందుకు నిర్ణయించుకుని ఈ మేరకు శుక్రవారం దండలు మార్చుకున్నారు. అందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురం మండలం చౌళూరు కు చెందిన కే నేత్రావతి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పని చేస్తోంది. ఆమెకు చినమత్తూరు మండలం కొడికొండకు చెందిన సి ఆర్ పి ఎఫ్ కానిస్టేబుల్ జిపి సూరప్పతో పెద్దలు నిర్ణయించి గత 2020 జూన్ 10వ తేదీన వివాహం జరిపించారు. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సజావుగా సాగినప్పటికీ అనంతరం ఇరువురి నడుమ భేదాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. దీంతో నేత్రావతి పుట్టింటికి రాగా సూరప్ప చెన్నైలో ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో సూరప్ప తనకు భార్య కావాలని కోర్టులో తన న్యాయవాది వెంకటేష్ ద్వారా కేసు దాఖలు చేశారు. అయితే తన భర్త తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేశారని, తన భర్త నుండి విడాకులు మంజూరు చేయాలని నేత్రావతి సైతం తన న్యాయవాదులు సజిలాబాను, నాగరాజు భూపతి ల ద్వారా కోర్టులో కేసు దాఖలు చేసింది. దీంతో కేసులు వాయిదాలు నడుస్తున్న సమయంలో ఇకపై తాను భార్యతో సఖ్యతగా ఉంటానని సూరప్ప చెప్పగా అందుకు అనుగుణంగా న్యాయవాది సజీలాభాను ఇరువురికి వేరువేరుగా, కలిపి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. దీంతో ఇరువురు తాము కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కోర్టులో ఇరువురు దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకున్నారు విడిపోవాల్సిన జంట కలిసి కాపురం చేసేందుకు నిర్ణయించుకోవడం పట్ల స్థానిక న్యాయవాదులు వారిని అభినందించారు. ఈ మేరకు వారిద్దరూ తమ కుటుంబ సభ్యులు, న్యాయవాదుల సమక్షంలో స్థానిక ఇందిరా పార్కులోని గణేష్ విగ్రహం ఎదుట పూలమాలలో మార్చుకున్నారు. ఇకపై తాము సఖ్యతగా ఉంటూ తమ భవిష్యత్తును సుఖమయంగా తీర్చిదిద్దుకుంటామని తెలిపారు. తమలో మనస్పర్ధలు లేకుండా ప్రేరణ కల్పించి, తిరిగి తాము ఒకటి ఎందుకు సహకరించిన న్యాయవాదులకు నేత్రావతి సూరప్పల తో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.