రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు. గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. అనుమానం రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ చేసిన వారిని ఖాసిం, మోనిస్, షోయబ్‌గా సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది వెల్లడించింది.వెంటనే పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 465 (ఫోర్జరీ), 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 120బీ (నేరపూరిత కుట్ర), 468 (మోసం చేయడం కోసం ఫోర్జరీ), 471 (నకిలీ పత్రాన్ని నిజమైనదిగా ఉపయోగించడం) కింద కేసు నమోదు చేశారు. కాగా, అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఎంపీ లాంజ్‌ను నిర్మించేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న డీ వీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇలా జరగడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు తరలించి.. ఎందుకు పార్లమెంట్లోకి చొరబడాలనుకున్నారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.