Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుపిఠాపురంలో వలస నాయకులదే పెత్తనం

పిఠాపురంలో వలస నాయకులదే పెత్తనం

స్థానిక నాయకులకు లభించని ఎమ్మెల్యే అభ్యర్థిత్వం

మొగలి శివప్రసాద్

గొల్లప్రోలు


 రాజకీయ పార్టీలు అంగ బలం ఉన్న వారి కంటే అర్థ బలం ఉన్న వారికే ప్రాముఖ్యత ఇస్తుండడంతో నిత్యం ప్రజలతో మమేకమయ్యే నాయకులు క్రమేణా మరుగున పడిపోతున్నారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా పారిశ్రామిక వేత్తలు, అర్ద బలం దండిగా ఉన్నవారు ఆయా పార్టీల తరఫున టికెట్లు దక్కించుకోవడంతో ప్రాంతీయ సమస్యలపై అవగాహన  స్థానిక నాయకులు వారికి అనుచరులుగానే మిగిలిపోతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో గత 2 దశాబ్దాలుగా ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులే ఆయా పార్టీల తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉంటున్నారు. స్థానిక నాయకులు మాత్రం ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడంలో విఫలమవుతున్నారు. నియోజకవర్గంపై అవగాహన లేని నాయకులకు ఆయా పార్టీలు  అధికారం అప్పగిస్తుండడం వల్లే స్థానిక సమస్యలు దశాబ్దాలుగా పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు.

  వెన్నా తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు...

  తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత పిఠాపురం మండలం జల్లూరు గ్రామానికి చెందిన వెన్నా నాగేశ్వరరావు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో టిడిపి టికెట్ కోసం వెన్నాతో పాటు పిఠాపురం మండలం నుండి  బుర్రా ఆంజనేయ కామరాజు, గొల్లప్రోలు నుండి మాదేపల్లి రంగబాబు పోటీపడేవారు. కానీ చివరికి వెన్నా నే టికెట్ వరించేది. టికెట్ కోసం  పోటీ పడ్డా ఎన్నికలలో  మాత్రం వెన్నా విజయానికి మాదేపల్లి, కామరాజు ప్రధానంగా కృషి చేసేవారు. అందుకే అప్పట్లో వీరిని పార్టీ అభిమానులు త్రిమూర్తులుగా పిలిచేవారు.1994 లో వంగా గీతా విశ్వనాద్ కు  ఎన్టీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బి ఫామ్ ఇచ్చినప్పటికీ ఆమె స్థానికేతరురాలని నాయకులు తిరుగుబాటు చేయడంతో చివరికి క్షణంలో మరలా టికెట్టు వెన్నా కే లభించగా ఆయన ఘన విజయం సాధించారు. వెన్నా మరణానంతరం మాదేపల్లి, ఆంజనేయ కామరాజులలో ఒకరు పార్టీని నడిపిస్తారని కార్యకర్తలు  ఆశించినా ప్రస్తుత టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ వి ఎస్ ఎన్ వర్మ రాజకీయ ప్రవేశం చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న వర్మ పిఠాపురం టిడిపి పగ్గాలు చేజి క్కించుకున్నారు. వాస్తవానికి వర్మ కూడా స్థానికులు కాదని ఆ పార్టీకి చెందిన అసమ్మతివాదులు పేర్కొంటున్నారు. వర్మ తమ స్వస్థలం పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామంగా పేర్కొంటున్నప్పటికీ ఆయన కుటుంబం కోనసీమ ప్రాంతం నుండి పి రాయవరం వలస వచ్చి  అనంతరం పి దొంతమూరు గ్రామంలో స్థిరపడ్డారని కొద్ది నెలల క్రితం టిడిపి అసమ్మతి నాయకులు గొల్లప్రోలు లో  ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. వర్మ టిడిపి తరఫున రెండు పర్యాయాలు పోటీ చేసి పరాజయం పొందగా ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 

   కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం పిఠాపురం మండలం నుండి మల్లాం గ్రామానికి చెందిన కేవీ సిహెచ్ మోహన్ రావు, బి కొత్తూరు గ్రామానికి చెందిన సంగిశెట్టి వీరభద్రరావు, గొల్లప్రోలు నుండి పాము సూర్యారావు ప్రధానంగా పోటీపడేవారు. టికెట్ మాత్రం మోహన్ రావు సంగిశెట్టి  లలో ఎవరో ఒకరికి దక్కేది. ఎవరికి టికెట్ లభించినా గొల్లప్రోలు మండలం నుండి పార్టీ విజయానికి సూర్యారావు కృషి చేసేవారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మోహన్ రావు 1989 లో ఎమ్మెల్యేగా గెలుపొంది కార్పోరేషన్ చైర్మన్ గాను, మంత్రిగాను పనిచేశారు. టిడిపి ఆవిర్భావానికి ముందు కూడా ఒక పర్యాయం కొప్పన కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. సంగిశెట్టి కూడా ఒక పర్యాయం స్వతంత్ర అభ్యర్థిగా  గెలుపొంది తర్వాత టిడిపిలో చేరారు.2009 సంవత్సరంలో వైయస్ హయాంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పోటీ చేయగా ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడంతో ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా ప్రస్తుతం ప్రాముఖ్యత లేకుండా పోయింది.

    వైసీపీలోనూ స్థానికేతరులదే హవా...

  వైసీపీ ఆవిర్భావం నుండి ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబాబు నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తున్నారు. ఆయన వైసీపీ తరఫున 2014,2019 ఎన్నికలలో పోటీ చేయగా 2019 ఎన్నికలలో విజయం సాధించారు.  దొరబాబు స్వస్థలం కాకినాడ సమీపంలోని కొవ్వూరు గ్రామం. కానీ దొరబాబు మాత్రం తన మాతృమూర్తి జన్మస్థలం గొల్లప్రోలు అని తన బాల్యమంతా ఇక్కడే గడిచిందని చెబుతారు . ఈయన ఇక్కడి నుండే గతంలో బిజెపి తరఫున కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం దొర బాబు స్థానంలో ఇన్ చార్జ్ గా నియమితు రాలైన   ఎంపీ గీత కూడా స్థానికేతరు రాలే కావడం విశేషం. ఈమె కూడా గతంలో ప్రజారాజ్యం తరపున పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

   జనసేన లోనూ అదే తీరు...

   జనసేన పార్టీలో పార్టీని బలపరిచేది స్థానిక నాయకులైతే పెత్తనం మాత్రం వలస నాయకులదే నన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులను కాదని కాకినాడకు చెందిన మాకినీడి శేషు కుమారి కి ఎమ్మెల్యే టికెట్టు కేటాయించారు. ఇటీవల ఆమెను తప్పించిన తర్వాత కూడా నియోజకవర్గంతో సంబంధంలేని కడియం గ్రామానికి చెందిన టీ టైం వ్యవస్థాపకుడు  తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. దీంతో గత కొంతకాలంగా ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు మల్ల గుల్లాలు పడుతున్నారు.  ఇటీవల కాలంలో  ఆయా పార్టీల తరపున స్థానిక నాయకులకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాగా పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తూ చుట్టపు చూపుగా వచ్చే వారికి కాకుండా స్థానిక సమస్యలపై అవగాహన ఉండి ప్రజా సేవ చేసే నాయకులకే ఆయా పార్టీలు టికెట్టు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article