పెండింగ్‌లో ఉన్న బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.పురపాలక చట్ట సవరణ బిల్లుపై వివరణ కోరారు. అలాగే కొత్తగా మరికొన్ని ప్రైవేట్ విశ్వ విద్యాలయాలకు అనుమతిస్తూ చట్ట సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిటైర్‌మెంట్ ఏజ్‌ను 61 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును గవర్నర్ తిరస్కరించారు. తన వద్ద పెండింగ్‌లో ఉన్న మూడు బిల్లులపై గవర్నర్ తమిళిసైన నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం రాజ్‌భవన్‌లో ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేనట్లైంది. ఈ మేరకు ఇవాళ సుప్రీంకోర్టుకు ఇదే అంశాన్ని నివేదించనున్నారు.
మరో రెండు బిల్లులు పురపాలక చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ వర్సిటీల బిల్లుపై వివరణ కావాలంటూ పెండింగ్‌లో పెట్టారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. పురపాలక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇంతకాలం ఉన్న మూడేళ్ల గడువును నాలుగేళ్లకు పెంచుతూ మున్సిపల్ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర సర్కారు తీసుకొచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకునేముందు మరింత వివరణ అవసరమని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి తీసుకొచ్చిన బిల్లుపై కూడా నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వం నుంచి వివరణ కావాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు.తెలంగాణలో గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టింది అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడు బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, మరో రెండు బిల్లులను ప్రభుత్వ పరిశీలన కోసం వెనక్కి పంపినట్లు తెలిపింది. గతేడాది సెప్టెంబర్ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. వాటిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఇవాళ మరోమారు విచారణ ఉన్న తరుణంలో మూడింటిపైనా గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం గవర్నర్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేనట్లైంది.