రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో:
పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 239 వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తోట వారి వీధిలో విస్తృతంగా పర్యటించి. 175 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారి నుండి సలహాలు, అర్జీలు స్వీకరించారు. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అడిగి తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్వయంగా తమ ఇంటికి వచ్చి చిరునవ్వుతో పలకరిస్తుండటంతో ప్రజల నుంచి విశిష్ట స్పందన లభించింది. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ఎటువంటి వివక్షకు తావులేకుండా అర్హులందరికీ జగనన్న ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తూ.. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
బహిరంగ చర్చకు సిద్ధమా..?
రహదారుల గూర్చి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశం, జనసేనలకు ఏమాత్రం లేదని మల్లాది విష్ణు విమర్శించారు. ధైర్యముంటే ఎవరి హయాంలో రోడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులకు ఖర్చు చేసింది కేవలం రూ. 2,953 కోట్లు కాగా ఈ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో ఖర్చు చేసింది అక్షరాలా రూ. 4,148 కోట్లు అని మల్లాది విష్ణు వెల్లడించారు. బాబు ఐదేళ్ల ప్రభుత్వంలో కేవలం రూ.4,400 కోట్లతో 10,700 కి.మీ. రోడ్లు నిర్మిస్తే.. జగనన్న రూ.7,340 కోట్ల నిధులతో 17,230 కి.మీ. మేర రోడ్లను నిర్మించినట్లు వివరించారు. జాతీయ రహదారుల కోసం టీడీపీ హయాంలో ఖర్చు చేసింది రూ. 13,353 కోట్లు కాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఖర్చు చేసింది అక్షరాలా రూ. 25,304 కోట్లుగా చెప్పారు. పైగా చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన రూ.3,800 కోట్ల రుణాలను ఇతర అవసరాలకు మళ్లించారని.. పసుపు-కుంకుమ పేరిట పప్పు బెల్లంలా ఖర్చు పెట్టినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే రూ. 152.86 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణాలు చేపట్టినట్లు తెలియజేశారు. కనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు ప్రతిపక్షాలు మానుకోవాలని.. ప్రజావసరాలను గుర్తించి పరిష్కరించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరెవరూ సాటిరారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, కృష్ణమోహన్, వసంత్, శర్మ, తోపుల వరలక్ష్మి, శోభన్, మహేశ్వరి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.