సార్వభౌమాధికారాన్ని కాపాడుకుందాం
సదస్సులో వామపక్ష నేతల పిలుపు
కడప సిటీ:రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, దేశ సమైక్యత సమగ్రతకు నష్టం కలిగించే సి ఎ ఏ ను రద్దు చేసే వరకు పోరాడాలని మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సదస్సులో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, సిపిఐ ఎంఎల్ డబ్ల్యూ రాము, రమణయ్య మాట్లాడుతూ
మోదీ ప్రభుత్వం 2019లో పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల మద్య ఆమోదింప | జేసుకున్న “పౌరసత్వ సవరణ చట్టం” ( సి ఏ ఏ) ఆనాటి ప్రజా ఉద్యమాల ధాటికి తాత్కాలికంగా అమలు చేయలేకపోయింది. పరిగ్గా 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించి. ప్రజల మద్య వైషమ్యాలు రెచ్చగొట్టి, మతకలహాలు సృష్టించి అధికారమే ధ్యేయంగా హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు, నరమేధానికి తెగబడుతున్నది. బిజెపి ఇంతకాలంగా ప్రయత్నిస్తున్న హిందూత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడానికే ఈ ప్రయత్నం.
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగం మౌలిక స్వరూపానికి విఘాతం కలిగిస్తున్నది. రాజ్యాంగంలోని అధికరణలు 14, 15, 16, 25లను ఉల్లంఘిస్తున్నది. ముస్లింలు అధికంగా వున్న పొరుగు దేశాలలో పీడనకు గురవుతూ, శరణార్ధులుగా వచ్చిన వారిని కాపాడేందుకు ఈ చట్టం తెచ్చామని ప్రజల్ని నమ్మించే ప్రయతం చేస్తున్నది. ఇది ఎంతమాత్రం నిజంకాదు. మరి శ్రీలంక, బూటాన్, మయన్మార్ లో పీడనకు గురవుతూ శరణార్ధులుగా వస్తున్న వారికి ఎందుకు రక్షణ కల్పించటంలేదు? రక్షణ కల్పించటం కొందరికి మాత్రమే వర్తించే సూత్రం అవుతుందా?
మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వటం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం. ఈ దేశంలో నివసిస్తున్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్దులు, సిక్కులు ఇలా అన్ని మతాలవారూ భారతీయులే. ఈ దేశ ప్రజల మద్య చీలికలు తెచ్చి భారతదేశ విచ్ఛిన్నానికి, వినాశనానికి ప్రయత్నిస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సి ఎ ఏ, ఎన్ ఆర్ సి , ఎన్ పి ఆర్ లకు వ్యతిరేకంగా దేశ సమగ్రతను కాపాడుకుంటూ, రాజ్యాంగ పరిరక్షణకోసం ఐక్యంగా పోరాడుదాం అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నగర కార్యదర్శులు ఎన్ వెంకట శివ, రామ్మోహన్ రెడ్డి,సుబ్రహ్మణ్యం, వీర శేఖర్, అన్వేష్, కేసీబాదుల్లా, బి మనోహర్, శ్రీనివాసులు రెడ్డి, దస్తగిరి రెడ్డి, గంగా సురేష్, శివకుమార్, వలరాజు, చిన్ని, మునయ్య, భాగ్యలక్ష్మి, శంకర్ నాయక్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.