ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరులో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి.రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, స్వల్ప ప్రకంపనలు మాత్రమే సంభవించాయని.. ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. భయపడాల్సిన పనిలేదని వివరించారు. కాగా, అకస్మాత్తుగా ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.ఇదిలాఉంటే.. ఉత్తర భారతదేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తాయన్న విషయం తెలిసిందే. తరచూ ఎక్కడో ఒకచోట భూకంపం సంభవిస్తుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో వరుసగా భూకంపాలు చోటు చేసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఏప్రిల్ లో తిరుపతిలో, మార్చిలో కర్నూల్ జిల్లా తుగ్గలి మండలంలో భూ ప్రకంపనలు సంభవించాయి. అంతకుముందు ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలో కూడా పలు చోట్ల భూమి కంపించింది.