వేలేరుపాడు
అనేక పోరాటాలతో నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీకి ఆర్థికంగా సహకరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సిపిఐ బృందంతో చాగరపల్లి, వేలేరుపాడు గ్రామాలలో మాస్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో గడపగడపకు సిపిఐ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. పోరాటాలకు ప్రజా బలంతో పాటు ఆర్థికంగా సహకారం ఎంతో అవసరమన్నారు. సిపిఐ చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేస్తూ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ పర్యటిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులను పట్టించుకోకుండా ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. ప్రభుత్వాలు మారిన నిర్వాసితుల పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తగిన గుణపాఠం ఎదుర్కోక తప్పదన్నారు. నిర్వాసితుల పక్షాన పలు రూపాల్లో పోరాటం చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడే భారత కమ్యూనిస్టు పార్టీకి దాతలు చేయూతనదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి మునీర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వసంతరావు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ధారా యేసు, జిల్లా కార్యవర్గ సభ్యులు సన్నేపల్లి సాయిబాబు, వేలేరుపాడు, జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శులు బాడిశ రాము, రమణ రాజు, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రా మధు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కరటం వెంకటేశ్వర్లు, కురిమెళ్ళ వెంకటేశ్వర్లు, కరటం సీతామహాలక్ష్మి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.