జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రతీ అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏర్పాటుచేసిన అఖిలపక్ష భేటీలో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరఫున రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్‌లు హాజరయ్యారు.మల్లికార్జున ఖర్గే తరఫున హాజరైన కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా అస్సాంలో జరిగిన ఘర్షణను ఈ భేటీలో లేవనెత్తినట్లు చెప్పారు. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ వంటి నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు. సీబీఐ, ఈడీలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ భేటీలో పాల్గొన్న వివిధ పార్టీల సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు.ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే చివరి సమావేశాలు ఇవే. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ప్రతి పార్లమెంటు సమావేశాల ముందు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటుచేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది.