Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని ఏం మాట్లాడారంటే.

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని ఏం మాట్లాడారంటే.

ఆనాడు తన పాలనలో రాష్ట్రంలోకి సీబీఐని అడుగు పెట్టనివ్వబోమని చంద్రబాబు అంటే.. వంత పాడిన ఎల్లో మీడియా.. అదే ప్రచారం చేసింది. చంద్రబాబుకు ఆస్థాన సలహాదారులైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రాజకీయ ఆక్టోపస్‌ రామోజీరావు.. అంతా కలిసి గూఢపుఠాని చేసి సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చేశారు. సీబీఐకి రాష్ట్రంలో ఎర్రజెండా అంటూ ఈనాడులో రాస్తే.. రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదని రాధాకృష్ణ రాసుకొచ్చారు. అందుకు అవకాశం ఇస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా ఏసీబీతో సోదాలు చేసే అవకాశం ఉందని.. అందుకే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని రాశారు.
అదే ఈరోజు టీడీపీతో పాటు, ఎల్లో మీడియా పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ అవినాశ్‌రెడ్డిపైనా, వివేకా హత్యపైనా రోజూ విషపురాతలు రాస్తూ.. అసత్యాలు ప్రచారం చేస్తూ.. సీబీఐకి బ్రహ్మరథం పడుతున్నారు. అలా నిస్సిగ్గుగా రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారు.

ఆ నిర్ణయానికి అసలు కారణం?

ఈమధ్య ఎల్లోమీడియా ఛానెళ్లు, పేపర్లతో పాటు టీడీపీ నేతలు ఒకే అంశంపై మాట్లాడుతున్నారు. దాన్నే అదేపనిగా ప్రచారం చేస్తున్నారు. వివేకా హత్యకేసు దర్యాప్తులో భాగంగా, ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించాలని సీబీఐ ప్రయత్నిస్తోందని ఊదరగొడుతున్నారు. మరి ఆనాడు, ఇదే టీడీపీ, ఎల్లో మీడియా.. రాష్ట్రంలో సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకుంది అనేది అందరూ తెలుసుకోవాల్సి ఉంది.
ఆరోజు రాధాకృష్ణ, రామోజీ సలహా మేరకే చంద్రబాబు ప్రధాని మోదీతో గొడవ పెట్టుకున్నారు. కేంద్రంలో మోదీ ప్రభావం పడి పోయిందని.. అందుకే ఆయనతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం మైనారిటీలు టీడీపీకి దూరం అవుతారని ఆ ఆలోచన చేశారు. మరి కేంద్రంతో వైరం పెట్టుకుంటే.. తమ పాపాలన్నీ బయటకు తీస్తారని, ఇంకా పాత కేసులన్నీ తిరగ తోడతారన్న భయంతో.. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ.. ఏకంగా 2018, నవంబరు 8న జీఓ నెం:176 జారీ చేశారు.

ఆ జీఓలో ఏముంది?:
సీబీఐ అనే కేంద్ర పోలీసు సంస్థ రాష్ట్రంలో కూడా పని చేయొచ్చని అంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ.. ఆ జీఓ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ కేసునూ సీబీఐ దర్యాప్తు చేయకూడదని, ఏ కేసులో ఎవరినీ విచారించొద్దని, అదుపులోకి తీసుకొవద్దని, అరెస్టు చేయకూడదంటూ ఆ జీఓలో స్పష్టం చేశారు.

అవినాష్‌ ఎందుకు టార్గెట్‌?

ఎల్లో మీడియా రాతలు, వాటి వెనుక అంతరార్ధాలను ఈరోజు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మనోడైతే ఒక రకంగా.. కాకపోతే మరో రకంగా రాతలు రాస్తూ.. చంద్రబాబు పాపాల్ని దాస్తున్నారు. ఇంకా వారి వ్యతిరేకులపై ఏ రకంగా విషం చిమ్ముతున్నారనేది మేధావులు కూడా తెలుసుకోవాలి.
అసలు ఎంపీ అవినాష్‌రెడ్డి చేసిన నేరం ఏమిటి? ఆయన చేసిన తప్పేమిటి? రెండుమార్లు ఎంపీగా గెల్చాడు. వివేకా హత్య కేసులో ఆయన ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేకపోయినా, సీబీఐ ఎప్పుడు పిల్చినా విచారణకు హాజరయ్యాడు. ఇప్పుడు తన తల్లి తీవ్ర అనారోగ్యం వల్ల, కొంత సమయం కోరుతున్నాడు. అందులో తప్పేముంది? ఎంపీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి.. ఎక్కడికీ పారిపోడు కదా? అలా అవినాష్‌ కోరడం టీడీపీకి, ఎల్లో మీడియాకు తప్పుగా కనిపిస్తోందా?.

దాన్ని పారిపోవడం అంటారా?

గుండెజబ్బుతో ఆస్పత్రిలో సీరియస్‌ స్టేజ్‌లో ఉన్న తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి వెళ్లడం పారిపోవడమా?. దాన్నే పదే పదే చెబుతూ.. అసత్యాలు ప్రచారం చేయడం ఎంత వరకు సబబు? పూర్తిగా గతి తప్పిన ఎల్లోమీడియా నానా హడావిడి చేసింది. పచ్చి అబద్ధాలు ప్రచారం చేసింది.
అవినాష్‌ అరెస్టుకు రాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని.. అందుకే రాష్ట్రానికి కేంద్ర బలగాలు తరలిస్తున్నారని, హెలికాప్టర్లు కూడా రప్పిస్తున్నారని.. పిచ్చిపిచ్చిగా దుష్ప్రచారం చేశారు.

బాబు బతుకంతా బెయిల్స్‌ కదా?:
నిజానికి చంద్రబాబుపై నమోదైన కేసుల్లో ఒక్కదానిపై అయినా విచారణ జరిగిందా? ప్రతి కేసులో ఆయన స్టే లేదా బెయిల్‌ పొందే రాజకీయం చేస్తున్నారు కదా? అయినా గతి తప్పిన ఎల్లో మీడియా జగన్‌గారిపై విషం చిమ్ముతూ.. ఆయనకు లేనిపోనివి ఆపాదిస్తూ.. విషపురాతలు రాయడం, వాటిపై ఆ ఛానళ్లలో తమకు అనుకూలమైన వారితో చర్చలు పెట్టడం నిత్యకృత్యంగా మారింది.
రాష్ట్రంలో టీడీపీ, ఎల్లో మీడియా వికృత విన్యాసాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. నిజంగా ఏ తప్పూ చేయకపోతే.. చంద్రబాబు, రామోజీరావు.. కోర్టులకెళ్లి స్టేలు, బెయిల్స్‌ ఎందుకు తెచ్చుకున్నారు? అభియోగాలు నమోదైన ప్రతిసారి వారు కోర్టులను ఆశ్రయించడం.. స్టే లేదా బెయిల్‌ బెయిల్‌ తెచ్చుకోవడం అందరికీ తెలిసిన విషయమే కదా?

వారికే ఆ హక్కులుంటాయా?:
ఏనాడైనా నిజాల్ని నిరూపించుకునేందుకు సిద్ధం. విచారణకు వస్తానని చంద్రబాబు చెప్పాడా? ఇక సీబీసీఐడీ విచారణ కోసం వెళ్తే.. నడుముకు బెల్టుతో, పక్కన వెంటిలేటర్‌ పెట్టుకుని, బెడ్‌పై పడుకున్న రామోజీరావు ఎంత డ్రామా చేశారో అందరూ చూశారు. అంటే కోర్టులకు వెళ్లడం.. స్టేలు, బెయిల్స్‌ తెచ్చుకునే హక్కులు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణకు మాత్రమే ఉంటాయా? ఇంకా ఎవరికీ ఆ హక్కులు వర్తించవా? అసలు ఎల్లో మీడియాకి కనీసం మానవత్వం అనేది ఉందా?.

మచిలీపట్నం సభపైనా తప్పుడు రాతలు:
మచిలీపట్నంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పోర్టు పనులను సీఎంగారు ప్రారంభిస్తే.. ఆయన ప్రసంగాన్ని ఆసాంతం వినేందుకు జనం ఆసక్తిగా కూర్చుంటే.. ఈనాడు మాత్రం వికృతంగా రాసింది. సీఎంగారు మాట్లాడుతుంటే జనం గోడ దూకి పోతున్నారంటూ రాశారు.

అది వారి దౌర్భాగ్యస్థితి

వాస్తవానికి ఇప్పుడు ఆ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. వారు తమ ఆత్మలను చంపుకుని.. జర్నలిజం విలువలను చంపుకుని యాజమాన్యాల ఇష్టాలనుగుణంగా రాయాల్సి వస్తోంది. ఇది నిజంగా బాధాకరం. సభలో ఉన్న జనానికి రెట్టింపు జనం బయట ఉంటే దాన్ని రాయడానికి ఈనాడుకు మనసొప్పదు. కానీ అసలు జనమే లేని చంద్రబాబు సభల్ని ఆకాశానికెత్తడం వారి దౌర్భాగ్య స్థితి.

దాన్ని రాయడానికీ మనసు రాదా?

జగన్‌గారు సీఎంగా ఉంటే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిస్తే.. ఎల్లో మీడియాకు మాత్రం రక్తకన్నీరు వస్తుందేమో? ఇప్పుడు కేంద్రం నిధులు వస్తే రాష్ట్రానికి నిధుల వరద అని రాశారు. రాష్ట్ర విభజన సమయంలో 2014–15 రెవెన్యూ లోటు గ్రాంటు కింద మీ చంద్రబాబు తేవాల్సిన డబ్బును మీరు తెచ్చుకోలేకపోతే.. మా సీఎంగారు కేంద్రంతో మాట్లాడి ఈరోజు రూ.10,461 కోట్లు తెచ్చారు. దాన్ని కూడా జీర్ణించుకోలేక.. నిధుల వరద అంటూ రాశారు.
మరి, ఇదే చంద్రబాబు, ఎల్లోమీడియా ఇప్పటి వరకు జగన్‌గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రతీసారి రకరకాల అభాండాలు వేశారు. ఇప్పుడు నిధులు సాధిస్తే.. దాన్ని ఎందుకు పాజిటివ్‌గా రాయడం లేదు. అంటే వాస్తవాలు రాయడానికి ఎల్లో మీడియాకు చేతులు రావు.

జనం సిద్ధంగా ఉన్నారు:

ఆనాడు సోనియాతో చేతులు కలిపిన చంద్రబాబు, జగన్‌గారిపై ఎన్ని కుట్రలో చేశారో అందరికీ తెలుసు. ఆరోజు కుట్ర చేసిన వారంతా ఈరోజు అనుభవిస్తున్నారు. మాకు దేవుడిపై నమ్మకం ఉంది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. అందుకే చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తూ ఆయన తప్పులను, పాపాలను దాచే ప్రయత్నం చేయడంతో పాటు, బాబు వ్యతిరేకులపై ఇష్టానుసారంగా బురద జల్లుతున్న ఎల్లో మీడియాకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article