Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై హత్యాయత్నం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై హత్యాయత్నం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో భారీ ధర్నా

అనంతపురము
రాప్తాడులో సిద్ధం సభ ప్రాంగణం వద్ద ఆదివారం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. గంట పాటు జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అనంతరం జర్నలిస్టు సంఘాల నాయకులు ఎస్పీ అన్బురాజన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అంతకు ముందు ఆందోళన కార్యక్రమంలో పయ్యావుల ప్రవీణ్ మాట్లాడుతూ, “మారణాయుధాలతో శ్రీకృష్ణను చంపేందుకు ప్రయత్నించారు. పక్కనున్న మరో ఇద్దరి పైన దాడికి తెగబడ్డారు. ప్రాణాపాయ స్థితిలో అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని రాప్తాడు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడి రక్తం కారుతున్న వ్యక్తిని ఆసుపత్రికి పంపించాలన్న కనీసం మానవత్వం మరిచి దాదాపు గంటసేపు ఎలాంటి చికిత్స అందించకుండా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టడం దారుణమైన విషయం. సిద్ధం సభకు బందోబస్తుకు వచ్చిన పోలీసులు కనీసం దాడిని అడ్డుకోకపోవడం బాధాకరమైన విషయం” అని తీవ్రంగా ఖండించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, స్వయానా ముఖ్యమంత్రి హాజరైన సభ కవరేజికి వెళ్లిన మీడియా మిత్రుల గ్యాలరీలోకి పెద్ద ఎత్తున జనం చొరబడి మీడియా వారిపై, పలువురు రిపోర్టర్లు పైన దాడికి పాల్పడడం… మీదపడి గొడవ పడటం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా గ్యాలరీలోకి జనాలు వెళ్ళకుండా అదుపు చేయాల్సిన పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, మీడియా, పాత్రికేయ రంగానిది ప్రజాస్వామ్యంలో కీలకమైన పాత్ర అని, సభ్య సమాజంలో జరుగుతున్న ఎన్నో అక్రమాలు, అరాచకాలను అరికట్టడానికి పలు సందర్భాలలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తూ ఉంటారని, ముఖ్యమంత్రి సభ కవరేజ్ కి వెళ్ళిన వారిపై అల్లరి మూకలు దాడి చేసి చంపాలన్న కసితో విచక్షణ రహితంగా కొట్టడం దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా తప్పు పట్టారు. సభ వెలుపల, సభ లోపల జరిగిన గొడవలు, అల్లర్లను ముఖ్యంగా మీడియా వారి విషయంలో దాడులు చేయకుండా అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దురదృష్టకరమన్నారు. గతంలో ఉరవకొండలో ముఖ్యమంత్రి సభ కవరేజీకి వెళ్లిన ఈనాడు ఫోటోగ్రాఫర్ సంపత్, స్థానిక రిపోర్టర్ల పైన దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల అనుయాయులు రిపోర్టర్ల పై చేస్తున్న దాడులను సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జరిగిన దాడులను సీరియస్ గా పరిగణించి తక్షణమే నిందితులను అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ డిమాండ్ చేస్తున్నదన్నారు. ధర్నా కార్యక్రమంలో
సభ్యులు ప్రభాకర్ నాయుడు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు రసూల్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి డానియల్ , షేక్ మహమ్మద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు జగదీష్ , యోగానంద, జాప్ నాయకుడు అనిల్ కుమార్, ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షఫీవుల్ల, రేపటి రామాంజనేయులు, సీనియర్ జర్నలిస్టు తలారి రామాంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు చౌడప్ప, చలపతి, పట్టుపోగల రామాంజనేయులు, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article