రామాలయం ప్రాణ ప్రతిష్టతో అయోధ్య నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయోధ్యకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక రామాలయం గురించి రోజుకో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తుంది. తాజాగా బాలరాముడి విగ్రహం చెక్కిన విధానం బయటకు వచ్చింది. ముఖ్యంగా బాలరాముడి కళ్లు తేజోమయంగా.. అందంగా కనిపించడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఆ కళ్లను అలాగే చూస్తూ ఉండాలనిపిస్తోంది. అంత అందంగా.. తేజోమయంగా ఉండడానికి కారణం చెక్కిన విధానం. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన విషయం తెలిసిందే. విగ్రహంలో ప్రత్యేకార్షణగా ఉన్న కళ్ల వెనుక ఉన్న కథను తాజాగా అరుణ్ యోగిరాజ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపాడు. కళ్లను తీర్చిదిద్దడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపాడు. సాధారణ ఉలి, సుత్తిని వాడలేదని చెప్పాడు. బంగారం ఉలి, వెండి సుత్తి వినియోగించానని చెప్పుకొచ్చాడు. అందుకే కళ్లు అంత అందంగా తేజోమయంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నాడు. ‘అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహ కళ్లు చెక్కడానికి వినియోగించిన బంగారు ఉలి, వెండి సుత్తిని మీతో పంచుకుంటున్నా’ అని ‘ఎక్స్’లో అరుణ్ యోగిరాజ్ పోస్టు చేశాడు. ఈ సందర్భంగా బంగారు ఉలి, వెండి సుత్తిలను చేతిలో పట్టుకున్న ఫొటోను పంచుకున్నాడు. ఈ మహాద్భాగ్యం దక్కడంతో అరుణ్ యోగిరాజ్ అత్యంత నియమ నిష్టలతో విగ్రహాన్ని రూపకల్పన చేశారు. విగ్రహం తయారుచేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు ఆయన తయారుచేసిన విగ్రహమే అయోధ్యలో ప్రతిష్టించడంతో ‘నా జన్మ ధన్యమైంది’ అని అరుణ్ యోగిరాజ్ భావించాడు.