పిల్లల్లో మానసిక సమస్యలకు ఎనర్జీ డ్రింక్ లు కారణమవుతున్నాయని .. మానసిక కుంగుబాటు, ఒత్తిడి, నిద్రకు సంబంధించిన సమస్యలు, చదువులో వెనకబడడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రొఫెసర్ అమెలియా హెచ్చరించారు. ఈ డ్రింక్ ల వినియోగంతో దీర్ఘకాలంలో మరిన్ని అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనర్జీ డ్రింక్ ల అమ్మకానికి వ్యతిరేకంగా పలు స్వచ్చంద సంస్థలతో కలిసి ప్రొఫెసర్ అమెలియా పోరాడుతున్నారు. డ్రింక్ ల అమ్మకాలపై ఆంక్షలు విధించాలని బ్రిటన్ లో పలు ఆందోళనలు కూడా జరిగాయి. దీంతో ప్రభుత్వం స్పందించి పదహారేళ్లలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్ లు అమ్మొద్దంటూ చట్టం తీసుకొచ్చింది.
ఎదుగుతున్న వయసులో శరీరానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయంటూ ఎనర్జీ డ్రింక్ ల తయారీదారులు చెబుతుంటారు.. చిన్నపిల్లలు, యువత కోసమని ప్రత్యేకంగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ డ్రింక్ లతో పిల్లల పెర్ఫార్మెన్స్ పెరుగుతుందని ప్రకటనలతో ఊదరగొడుతుంటారు. ఈ ప్రకటనల ప్రభావంతోనో, పిల్లల ఆరోగ్యం కోసమనో తల్లిదండ్రులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ డ్రింక్ ల వల్ల ప్రయోజనంలేదని తమ అధ్యయనంలో తేలిందని ప్రొఫెసర్ అమెలియా అన్నారు.
ఇంగ్లాండ్ లోని టీసైడ్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ట్రాన్స్ లేషనల్ రీసెర్చ్ తోపాటు న్యూకాజిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల యువతపై ఎనర్జీ డ్రింక్ ల ప్రభావంపై అధ్యయనం నిర్వహించారు. ఇందుకోసం 21 దేశాలకు చెందిన 12 లక్షల మందిపై జరిపిన పలు పరిశోధనలను నిశితంగా పరిశీలించారు. ఎదిగే పిల్లలకు ఎనర్జీ డ్రింక్ లు తాగించడం వల్ల ఉపయోగం లేకపోగా కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతోందని ఈ పరిశోధనలో తేలింది. ఎనర్జీ డ్రింకుల పేరుతో అమ్ముతున్న హై కెఫైన్ డ్రింక్ లతో యువత పలు మానసిక సమస్యలు ఎదుర్కొంటోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.