వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దీపికా వేణు
లేపాక్షి: త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపించి మిమ్మల్ని సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపికా వేణు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొండూరు, వడ్డిపల్లి, తిమ్మగానిపల్లి, మైదు గోళం గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వైకాపా నాయకురాలు మధుమతి రెడ్డి, మండల వైకాపా కన్వీనర్ నారాయణస్వామి, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట ప్రచారం నిర్వహిస్తూ ఒక్కసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని ప్రజలను దీపికా వేణు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట వైకాపా ప్రవేశపెట్టిన ఎన్నికల హామీల కరపత్రాలను ఇంటింటా ఆ పంచిపెట్టారు. ఈ సందర్భంగా దీపికా వేణు, మధుమతి రెడ్డిలు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకే అందజేయడం జరిగిందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి చేసిన ప్రయత్నాలు ఏవి లేవన్నారు.అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేయడం జరిగిందన్నారు. హిందూపురంలో గత రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే హిందూపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. చివరకు గ్రామ సమీపంలో రాగి కోస్తున్న కూలీల జతలో దీపికా వేణు రాగి కోత లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు లీలావతి, ఎంపీటీసీ భాగ్యమ్మ, అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ ప్రభాకర్ గౌడ్, సర్పంచులు ఆదినారాయణ, మంజునాథ్, వైకాపా నాయకులు వేణుగోపాల్ రెడ్డి, చలపతి, జే కే ప్రభాకర్, మహేందర్ రెడ్డి, తిమ్మారెడ్డి, రవీంద్రారెడ్డి లతోపాటు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.