Thursday, November 28, 2024

Creating liberating content

క్రీడలుముగిసిన తొలిరోజు ఆట.. భారత్ స్కోరు 336/6

ముగిసిన తొలిరోజు ఆట.. భారత్ స్కోరు 336/6

భారీ సిక్స్‌తో సెంచరీ చేరిన యశస్వి జైస్వాల్

భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (257 బంతుల్లో 179 పరుగులు; నాటౌట్, 17 ఫోర్లు, 5 సిక్సర్లు) అదరగొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లను రోజంతా ఆటాడుకుంటూ సెంచరీతో చెలరేగాడు. తన టెస్టు కెరీర్లో ఆరో మ్యాచ్‍లోనే రెండో శతకంతో సత్తాచాటాడు యశస్వి. విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య నేడు (ఫిబ్రవరి 2) రెండో టెస్టు మొదలైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 93 ఓవర్లు ఆడి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ అద్బుతమైన బ్యాటింగ్‍తో ఫస్ట్ డే టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. యశస్వి, రవిచంద్రన్ అశ్విన్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ద్విశతకానికి జైస్వాల్ చేరువయ్యాడు.
ఈ రెండో టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది టీమిండియా. కెప్టెన్ రోహిత్ శర్మ (14) నిదానంగా మొదలుపెట్టినా.. మరో ఎండ్‍లో యశస్వి దూకుడు ప్రదర్శించాడు. కాగా 18వ ఓవర్లో బషీర్ బౌలింగ్‍లో రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత శుభ్‍మన్ గిల్ (34) మొదటి నుంచే ధీటుగా ఆడాడు. యశస్వి, గిల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఆండర్సన్ బౌలింగ్‍లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగాడు. దూకుడు కొనసాగించిన యశస్వి 89 బంతుల్లో హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. దీంతో లంచ్ సమయానికి 2 వికెట్లకు 103 రన్స్ చేసింది భారత్.లంచ్ తర్వాత కూడా యశస్వి జైస్వాల్ ఆధిపత్యం కొనసాగింది. శ్రేయస్ అయ్యర్ (27) ఔటైనా ఈ యువ సంచలనం మాత్రం అదే దూకుడు కంటిన్యూ చేశాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ముందుకు సాగాడు. ఆఫ్ డ్రైవ్‍లతో కొన్ని చూడచక్కని షాట్లు, మరికొన్ని భారీ షాట్లతో మెరిపించాడు జైస్వాల్.
యశస్వి జైస్వాల్ భారీ సిక్స్‌ బాది సెంచరీకి చేరాడు. 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఏ మాత్రం భయం లేకుండా భారీ షాట్ ఆడాడు యశస్వి. ఇంగ్లంట్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ల్టీ బౌలింగ్‍లో క్రీజును వదిలి ఫ్రంట్‍కు వచ్చి మరీ లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడాడు జైస్వాల్. బంతి స్టాండ్స్‌లో చాలా దూరంగా పడింది. దీంతో భారీ సిక్స్‌తో సెంచరీ చేరాడు జైస్వాల్. కేవలం 151 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరుకున్నాడు. హెల్మెట్ బ్యాక్ కింద పెట్టి.. చేతులు ఊపుతూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.
సెంచరీ తర్వాత కూడా జైస్వాల్ జోరు కొనసాగించాడు. ఈ మ్యాచ్‍తో టీమిండియా టెస్టు జట్టులో అరంగేట్రం చేసిన రజత్ పటిదార్ కాసేపు జైస్వాల్‍కు తోడుగా నిలిచాడు. దూకుడు పెంచిన జైస్వాల్ 224 బంతుల్లో 150 పరుగుల మార్కుకు చేరాడు. అక్షర్ పటేల్ (27), కేఎస్ భరత్ (17) కాసేపు నిలిచారు. మరో ఎండ్‍లో యశస్వి జైస్వాల్ రోజు ముగిసే వరకు దీటుగా ఆడి ద్విశతకానికి చేరువయ్యాడు. అయితే, మిగిలిన బ్యాటర్లు ఎవరూ హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article