పరిమితికి మించి ప్రయాణికులతో ఆటోవాలాలు
మినీ బస్సులను తలపిస్తున్న ఆటోలు
రేణిగుంట
భారతదేశంలోనే సుప్రసిద్ధ దేవాలయం తిరుమల. దేశ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తలనీనాల సమర్పించి మొక్కలు తీర్చుకుంటూ ఉంటారు. అటువంటి సుప్రసిద్ధ ఆలయానికి చేరుకోవాలంటే రేణిగుంట రైల్వే జంక్షన్ ఒక ప్రవేశ ద్వారంగా విరాసిల్లుతుంది. యాత్రికులు రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత బస్సులు లేదా అనుమతింపబడే ప్రైవేటు వాహనాలలో తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. కొందరు భక్తులు రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి తిరుపతి బస్టాండ్ కు ఆటోల ద్వారా కూడా ప్రయాణించి బస్సులో తిరుమల ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆటోలో త్రీ ప్లస్ వన్ మాత్రమే ప్రయాణించాలి కానీ ఆ నియమాలను తుంగలో తొక్కి అపరిమితంగా పదిమందికి పైగానే ఆటో లో ఆటోవాలాలు కుక్కి ,అంతేకాదు ఆటో పైన లగేజ్ తో నింపి యాత్రికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఆటోవాలాలు. ఆ విషయానికొస్తే రేణిగుంట రైల్వే స్టేషన్ లో మూడు ఆటో యూనియన్ ఉన్నాయి, అందులోని సభ్యులు మాత్రమే రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి యాత్రికులను తిప్పే అవకాశం ఉంటుంది. అది కూడా పూర్తిగా నిబంధనలతో. యూనియన్ లో లేని ఆటోలు కూడా అదునుగా భావించి నిబంధనలకు విరుద్ధంగా మినీ బస్సులను తలపిస్తూ ,భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అపరిమిత ప్రయాణికులతో సొమ్ము చేసుకుంటున్నారు. ఇటువంటి ఆటోవాలాల వల్ల రైల్వే స్టేషన్నే నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న కారు మరియు సుమో యూనియన్లు చాలా నష్టపోతున్నామని అంతేకాకుండా యాత్రికుల ప్రాణాలతో ఆటో వారు చలగాటమాడుతున్నారని, ఇప్పటికైనా అటువంటి ఆటోవాలాలను పోలీసు శాఖ ,రైల్వే పోలీసులు మరియు రవాణా శాఖ అధికారులు ఉక్కు పాదం మోపి యాత్రికులకు రక్షణ కల్పించాలని యాత్రికులు కోరుతున్నారు.