ప్రజాభూమి కాకినాడ
రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కాకినాడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరు కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సోమవారం ఉదయం జిల్లా కలెక్టరు డా కృతికా శుక్లా ..కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ నిధులు (సీఎస్ఆర్), కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ శాఖల ద్వారా జిల్లాలో దాదాపుగా రెండు వందల పైనే చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ చలివేంద్రాన్ని రానున్న 40 రోజులు పాటు ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని, చిన్నారులు, వృద్దులు వడ దెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా పాఠశాలలు ఈ నెల ఆఖరి వరకు ఉంటున్నందున వాటర్ బెల్ కాన్సెప్ట్ తప్పనిసరిగా అమలు అయ్యేవిధంగా ప్రతి గంటకు విద్యార్థులు మంచినీరు తాగే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా పాత్రికేయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.