- ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట
కదిరి:ఈ నెల 4న పెనుకొండలో జరిగే ‘రా కదిలిరా’ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కదిరి అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రా కదిలిరా కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారన్నారు. భారీగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లి విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుత వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టగానే అందరి సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అదేవిధంగా తనపేరు మొదటి జాబితాలో లేదని కొందరు రాజకీయం చేస్తున్నారని, అలాంటి గాలి మాటలు ఎవరూ నమ్మవద్దని సూచించారు. గతంలో చంద్రబాబు కదిరికి విచ్చేసినప్పుడే సభాముఖంగా తన పేరు ఖరారు చేశారని, అధిష్టానం ఆ మాటను కట్టుబడి ఉందని, ఇందులో ఎలాంటి అపోహ లేదన్నారు. తన టికెట్ విషయంలో అధిష్టానం స్పష్టంగా ఉందని, తాను స్పష్టంగా ఉన్నానని, నియోజకవర్గ ప్రజలు కూడా స్పష్టంగా ఉండాలని కోరారు. మనమందరం ఏకమై కదిరిలో టీడీపీ జెండా ఎగురవేద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పి.వి. పవన్ కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు, సీనియర్ నాయకులు కెపి అంజినప్పనాయుడు, శ్రీరాములు నాయుడు, మండల క్లస్టర్ ఇన్చార్జ్ దండే రవి, పాలగిరి బాషా, మైనార్టీ మండల అధ్యక్షుడు షేక్ అజ్మతుల్లా, యువ నాయకులు దండే గంగశేఖర్, బీసీ సెల్ రవి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.