అనంతపురము:పేదరికంపై విజయం సాధించాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని వక్తలు పేర్కొన్నారు. అనంతపురం రూరల్ మండలం విద్యారణ్యనగర్‌లోని జోర్డాన్ ఇంగ్లిష్ మీడియం స్కూలు వార్షికోత్సవం
శనివారం ఘనంగా జరిగింది. సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత జోర్డాన్ పాఠశాలను స్థాపించిన జంబాపురం డేవిడ్ చిత్రపటానికి కరస్పాండెంట్ విక్టర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమకన్నా ఉన్నతంగా ఉండాలని పాఠశాలకు పంపుతారన్నారు. వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా తమ ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుందన్నారు. ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్లను చదువు సంబంధిత విజ్ఞాన సముపార్జనకు వినియోగించుకోవాలని సూచించారు. అంతే తప్ప గేమ్‌లు ఆడటానికి, సోషల్ మీడియాలో గంటల తరబడి టైం పాస్ చేయడానికి ఏమాత్రమూ కాదన్నారు. స్మార్ట్ ఫోన్లను పరిమితికి మించి వాడితే , అది వ్యసనంగా మారి వాటికి బానిసలవుతారని, ఫలితంగా చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని, అలాంటి పరిస్థితికి ఏ ఒక్క విద్యార్థీ వెళ్లకూడదని హితోపదేశం పలికారు. సమాజంలో గౌరవం పొందాలన్నా.. ఉన్నతమైన జీవితం గడపాలన్నా.. చదువు అత్యంత కీలకపాత్ర పోషిస్తుందన్నారు. చదువుతో పాటు సంస్కారం, పెద్దల పట్ల గౌరవం, సేవాభావం, నైతిక విలువల గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు. విద్యార్థి దశలో చదువుపైనే ధ్యాస ఉండాలని.. చెడు సావాసాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా జోర్డాన్ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ వస్తున్నారని పిల్లలను అభినందించారు. మంచి మార్కులతో వంద శాతం ఉత్తీర్ణతతో ఈసారి కూడా అద్భుతాలు సాధిస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు హుషారెత్తించే, వినోద భరితమైన, సందేశాత్మకమైన పాటలతో అలరించారు. కార్యక్రమంలో ఏజీఎస్ సాల్మన్ తో పాటు జోర్డాన్ స్కూల్ ఉపాధ్యాయులు అనూరాధ, పర్వీన్, సైరాభాను, యశోదకుమార్, అరుణ, జ్యోతి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.