ఉక్కు పరిరక్షణ కమిటీ రాస్తారోకో
ప్రజాభూమి, బుట్టాయగూడెం.
ముప్పైరెండు మంది ఆత్మబలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రoలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేందుకు ప్రయత్నం చేయడం దురదృష్టకరమని వామపక్ష పార్టీలు,ప్రజా సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమేరకు బుట్టాయగూడెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపులో భాగంగా బుధవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి, నిరసన కార్య్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు కారం రాఘవ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, 32మంది ప్రాణ త్యాగాలు, ఎందరో సొంత భూములు త్యాగాల ఫలితంగా నిర్మించిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రవేట్ పరం చేయడం దుర్మార్గపు చర్య అన్నారు.విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దనిరెండు సంవత్సరాలనుండి విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న నిరసనలు గుర్తించలేని ప్రభుత్వాలు పదేపదే అమ్మకం చేసేందుకు సిద్ధపడటం సరైనది కాదన్నారు. కరోనా కాలంలో లాభాల్లో నడిచిన ఉక్కు పరిశ్రమకు ఇంతవరకు ఎందుకు సొంత గనులు కేటాయించలేదని వారు ప్రశ్నించారు.తక్షణమే విశాఖ ఉక్కు పరశ్రమకు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపద అయిన ప్రభుత్వ ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మకం చేస్తుందని విమర్శించారు. విశాఖ ఉక్కును కారు చౌకగా కట్టపెట్టేందుకు చర్యలుముమ్మరం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని లేని పక్షంలో మరిన్ని ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం నాగమణి,సిపిఎం మండలకార్యదర్శి వర్గసభ్యులు పోలోజు నాగేశ్వరావు, కమిటీ సభ్యులు కారం భాస్కర్, పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు బి. వినోద్ తదితరులు పాల్గొన్నారు.