కదిరి :రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ రాష్ట్ర ప్రజలందరి ఆశీర్వాదాలు కావాలని కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.యస్ మక్బూల్ పేర్కొన్నారు. ప్రచారం చేసేందుకు తాను ఏ గ్రామానికి వెళ్లినా.. ఏ ఇంటి తలుపు తట్టినా ఒక్కటే మాట.. మా ఓటు సీఎం జగన్ కే అంటున్నారన్నారు. మంగళవారం తలుపుల మండల పరిధిలోని వేపమాని పేట గ్రామపంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మక్బూల్ పాల్గొన్నారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మక్బూల్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. “అవ్వా తాతల ఆశీర్వాదాలు, సామాన్యులు చూపించే అభిమానం చూస్తుంటే సీఎం జగనన్న చేసిన మేలు వారి చిరునవ్వులో కనబడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఆయననే మరోసారి సీఎంను చేసుకుంటామని ప్రజలే స్వచ్ఛందంగా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. వారందరూ ఆశించినట్లుగానే రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ మరింత మేలు చేకూర్చే విధంగా జగనన్న పాలన ఉంటుందని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ చెప్పే కల్లబొల్లి మాటలు ఎవరూ నమ్మవద్దు. బాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ కరువు తప్పదు. అందుకని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొచ్చిన జగనన్నను మరోసారి ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని కొనియాడారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, సేవాదళ్ జోనల్ ఇన్చార్జ్ డీకే బాబు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.