అధికారుల పర్యవేక్షణా లోపం తో మూడు పూలు ఆరుకాయల చందాన మట్టి వ్యాపారం.
ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిషేధిత ప్రాంతాలలో మట్టి మాఫియా అడ్డా…
ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమంటున్న పరిశీలకులు.
ప్రైవేట్ మైనింగ్ వ్యవస్థనీ అడ్డం పెట్టుకొని రాజ్యమేలుతున్న మాఫియా
ప్రజాభూమి ఏలేశ్వరం
ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 54 లో అప్పట్లో 36 నల్ల కంకర క్వారీలను ప్రభుత్వం నిషేధించినా అడపాదడపా నల్ల కంకర క్వారీల బ్లాస్టింగ్లు, మట్టి మాఫియా దందాలు ప్రతి శని,ఆదివారాల్లో జరుగుతున్న ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ప్రమాదం అంచున జలాశయం ఉందని పలువురు పరిశీలకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏలేశ్వరం పట్టణం తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో గృహ నిర్మాణానికి, పునాదులు నింపేందుకు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన లే అవుట్ లలో ఈ మట్టిని నింపేందుకు అక్రమ మట్టి మాఫియా దందాలు జరిపి నిషేధిత సర్వే నెంబర్ 54 లో ఉన్న మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేస్తున్నారు. డ్యాం కు అతి సమీపంలో ఉన్న కొండ వద్ద మట్టిని పలువురు అక్రమార్జనా పరులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రతీ నెల వచ్చే రెండవ శనివారం తో పాటు ఆదివారం తెల్లవారు జాము వరకు , అలాగే ప్రతీ వారం లో వచ్చేశనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు మట్టి మాఫియా విచ్చలవిడిగా ఆయా ప్రాంతాల్లో త్రావ్వకాలు నిర్వహిస్తున్నట్లు పలువురు ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించి వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుండి జే ఇ , డిఇ, ఈఇ లతో పాటు కనీసం కార్యాలయ సిబ్బంది కూడా ఇక్కడ నివాసం ఉండక పోవడంతో మట్టి మాఫియా, క్వారీ మాఫియాల ఆగడాలు మూడు పూలు ఆరు కాయలు చందాన ఉందని విశ్లేషకులు ఆక్షేపిస్తున్నారు. వీరికి బాసటగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైవేట్ మైనింగ్ రుసుము వసూళ్ల దారులు మద్దతుతో వారి అండదండలతో ఆ కొండల్లో ఉన్న మట్టి, గ్రావెల్, నల్ల కంకరకు ఉపయోగపడే బండలు రాళ్లు కరిగి అవిరై పోతున్నాయి. రెవెన్యూ అధికారులు, సంబంధిత ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ అధికారులు, స్థానిక పోలీస్ అధికారుల సమన్వయ లోపం తోనే ఈ వ్యవహారం అంతకంతకు ఊడలు వేస్తున్నాయి. ట్రాక్టర్ గ్రావెల్ మట్టి కి వేయి రూపాయల నుండి 12 వందల రూపాయలు, 12 టైర్ల లారీ కి 15 వందల రూపాయలు నుంచి రెండు వేల రూపాయలు అమ్ముతుండగా,ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రవేట్ మైనింగ్ రుసుము వసూళ్ల దారులు ట్రాక్టర్ కు 200 రూపాయలు, 12 టైర్ల లారీకీ 600 రూపాయలు వసూలు చేస్తూ అక్రమ మైనింగ్ మాఫియా కి అండతో ఉంటూ రాత్రికి రాత్రి ఏలేరు ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉన్న కొండలను మిషన్లతో, జె. సి. పి. లతో తవ్వి వ్యాపారం చేస్తున్నారు . ఈ వ్యవహారంపై స్థానికలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామికి కార్తీక మాసంలో జరిగే విశేష సమారాధన కార్యక్రమాలకు బందోబస్తు డ్యూటీ తో ఉన్నామని తెలిపారు. అదే విధంగా మండల తాసిల్దార్ కి ఫిర్యాదు చేయగా ఆ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు ఎవరైతే చేపట్టారో వారిని గుర్తించి వారి యొక్క వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారన్నారు.అయితే ఆ ప్రాంతానికి ఏ ఒక్క రెవెన్యూ అధికారి రాకపోవడం విడ్డూరం. అంతే కాక ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు ఉన్నతాధికారులకు తెలిపిన ఈ వ్యవహారం పై స్పందన కనుచూపు మేర కనిపించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు . ఇంతే గాక ఈ జాలాశయానికి ఆవలి గా ఉన్న రిజర్వాయర్ కి సంబంధించిన భూములలో మట్టిని ఇటుక బట్టీలు నిర్వహించే వ్యక్తులు అక్రమంగా త్రవ్వకాలు జరుపుతున్న ప్రాజెక్టు అధికారులకు చీమకుట్టిన నైనా లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రాజెక్ట్ అధికారులతో పాటు స్థానిక రాజకీయ నాయకులకు కూడా అక్రమ మాఫియా దందా దారులు జేబులు నింపుతున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు జిల్లా ఉన్నంతధికారులు దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని పరువులు విజ్ఞప్తి చేస్తున్నారు.