సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఆల్ఫా హోటల్‌లో బాంబు పెట్టారని సమాచారం ఇవ్వడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం అది ఫేక్ కాల్‌గా గుర్తించారు. పూర్తి దర్యాప్తు చేపట్టి ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామని డీసీపీ సుబ్బారాయుడు తెలిపారు.
హోటల్ ఆల్ఫాలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. శనివారం రాత్రి 10:45 ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆల్ఫా హోటల్ కు చేరుకుని ..బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి దాదాపు రెండు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీలలో అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదని ..హోటల్ లో ఎలాంటి పేలుడు పదార్థం లేదని, ఎవరో ఆకతాయితనంతో ఫోన్ చేసి ఉంటారని చెప్పారు. ఫోన్ చేసింది ఎవరని దర్యాఫ్తు చేయగా.. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అని తేలింది. నిందితుడికి సంబంధించి పూర్తి వివరాలపై ఇంకా ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు.