Thursday, November 28, 2024

Creating liberating content

క్రీడలుసెంచరీతో అదరగొట్టిన శుభ్‍మన్ గిల్

సెంచరీతో అదరగొట్టిన శుభ్‍మన్ గిల్

భారత యువ స్టార్ బ్యాటర్ శుభ్‍మన్ గిల్ ఎట్టకేలకు ఫామ్‍లోకి వచ్చేశాడు. కొంతకాలంగా టెస్టు క్రికెట్‍లో వరుసగా విఫలమవుతున్న గిల్.. సెంచరీతో అదరగొట్టాడు. 11 నెలల తర్వాత టెస్టుల్లో శతకం చేశాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‍తో జరుతున్న రెండో టెస్టులో టీమిండియా యంగ్ సెన్సేషనల్ శుభ్‍మన్ గిల్ మెరిశాడు. మ్యాచ్ మూడో రోజైన నేడు (ఫిబ్రవరి 4) భారత రెండో ఇన్నింగ్స్‌లో గిల్ సెంచరీ బాదాడు. టీమిండియా భారీ ఆధిక్యానికి బాటలు వేశాడు. 147 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు గిల్.
వన్డేలు, టీ20ల్లో అద్భుతంగా ఆడుతున్న శుభ్‍మన్ గిల్.. టెస్టు క్రికెట్‍లో మాత్రం తన స్థాయి మార్క్ వేయలేకపోయాడు. 21 టెస్టుల్లో 29 సగటుతో ఉన్నాడు. కొంతకాలంగా గిల్ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో టెస్టు క్రికెట్‍కు గిల్ సరిపోడనే విమర్శలు వినిపించాయి. టెస్టుల్లో అతడిని పక్కనపెట్టి వేరే బ్యాటర్లకు అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇంగ్లండ్‍తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో ఆ విమర్శలకు గిల్.. బ్యాట్‍తోనే సమాధానంతో చెప్పినట్టయింది. క్లాసీ షాట్లతో శుభ్‍మన్ అదరగొట్టాడు.
శుభ్‍మన్ గిల్‍కు టెస్టు క్రికెట్‍లో ఇది మూడో సెంచరీగా ఉంది. సుమారు 11 నెలల తర్వాత టెస్టు శతకం చేశాడు గిల్. గతేడాది మార్చిలో ఆస్ట్రేలియాపై టెస్టు సెంచరీ చేశాడు. ఆ తర్వాత 12 ఇన్నింగ్స్‌లో అతడు చేసిన అత్యధిక స్కోరు 34 పరుగులకే. అది కూడా ఇంగ్లండ్‍తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే చేశాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి మళ్లీ ఫామ్ అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు కోల్పోకుండా 28 పరుగుల వద్ద నేడు మూడో రోజు ఆటకు భారత్ బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (17) వెనువెంటనే ఔటయ్యారు. వీరిద్దరినీ ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఔట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ (29) కాసేపు నిలువగా.. రజత్ పాటిదార్ (9) త్వరగా పెవిలియన్ చేరాడు. ఈ దశలో శుభ్‍మన్ గిల్ అద్భుతంగా ఆడాడు. ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా దూకుడుగానే పరుగులు చేశాడు.
గిల్‍కు అక్షర్ పటేల్ (45) సహకరించాడు. ఇద్దరూ కలిసి భాగస్వామ్యం కొనసాగించారు. డీఆర్ఎస్ ద్వారా ఓసారి ఔట్ ప్రమాదం నుంచి గిల్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత క్లాసీ షాట్లతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో 60 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరాడు గిల్. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. 132 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేసుకున్నాడు శుభ్‍మన్. అయితే, చాలా కాలం తర్వాత టెస్టు సెంచరీ చేసినా పెద్దగా సంబరాలు చేసుకోలేదు. శతకం తర్వాత కాసేపటికే ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‍లో గిల్ ఔటయ్యాడు. అక్షర్ కూడా ఆ తర్వాత పెలివియన్ చేరాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article